యూత్ టార్గెట్‌గా KCR భారీ వ్యూహం.. CM స్కెచ్‌తో యువత BRSకు అట్రాక్ట్ అయినట్టేనా..?
గత నెలలో సీఎం కప్ పేరుతో నిర్వహించిన క్రీడా పోటీల్లో సుమారు 3.5 లక్షల మంది పాల్గొన్నారు. దీని వల్ల పార్టీకి ఎంత మైలేజ్ వచ్చింది? యూత్ ఓటర్లంతా బీఆర్ఎస్‌కు దగ్గరయ్యారా? వచ్చే ఎన్నికల్లో వారి ఓట్లు ఎంత వరకు అనుకూలంగా మారే చాన్స్ ఉంది? అనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు గులాబీ నేతలు.
సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన ఈ పోటీల వల్ల పార్టీకి మైలేజ్ పెరిగిందా? అనే విషయంపైనా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆ 3.5 లక్షల మందికి సంబంధించి ఫోన్ నంబర్లతో సహా పూర్తి వివరాలు నమోదు చేసిన బీఆర్ఎస్ లీడర్లు.. ఎన్నికల ముందు వారితో టచ్‌లో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. మరి యూత్ ఓటర్లు అధికార పార్టీ మాయలో పడతారా? ఎన్నికల టైంలో ఎటువైపు నిలబడతారు? అనేది ఆసక్తికరంగా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో: పొలిటికల్ పరిస్థితులను అంచనా వేసేందుకు సీఎం కేసీఆర్ సర్వేలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. వాటి నివేదికల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్రంలో ఏడాదిన్నరగా సర్వేలు మరింత ఊపందుకున్నాయి. 2014 తర్వాత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు బీఆర్ఎస్‌పై నెగెటివ్‌గా ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ రాకపోవడం, ఖాళీలు భర్తీ చేయకపోవడం వంటి విషయంలో ప్రభుత్వంపై వారు అసంతృప్తితో ఉన్నట్టు బీఆర్ఎస్ లీడర్లు గుర్తించారు. పలు సర్వేల్లోనూ ఇదే వెల్లడైనట్టు సమాచారం. దీంతో వీరు విపక్ష పార్టీల వైపు మళ్లుతున్నట్టు గుర్తించిన గులాబీ పార్టీ.. ఎలాగైనా యూత్‌ను ఆకట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.
ప్రధానంగా హుజూరాబాద్, మునుగోడు బై ఎలక్షన్‌లో యూత్ ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపారన్న అనుమానం బీఆర్ఎస్‌ను వెంటాడుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే యూత్‌కు దగ్గరవ్వాలని భావించిన అధికార పార్టీ.. క్రీడలు నిర్వహించి పార్టీపై యూత్‌లో ఉన్న వ్యతిరేకతను కాస్త తగ్గించవచ్చనే అంచనాకు వచ్చింది. అందుకోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పేరుతో క్రీడలు నిర్వహించింది. ప్రభుత్వం తరుపున ఈ బాధ్యతలను స్పోర్ట్ అథారిటీకి అప్పగించింది. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలను అందులో భాగస్వామ్యం చేసింది.
సీఎం కప్‌పై సర్వే
సీఎం కప్ పేరుతో గత నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ టోర్నీలో సుమారు 3.5 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు సంబంధించిన వివరాలను ఫోన్ నంబర్లతో సహా అధికార పార్టీ నేతలు సేకరించారు. వారి అసెంబ్లీ సెగ్మంట్, తల్లిదండ్రుల వృత్తి తదితర వివరాలను నమోదు చేశారు. ఎన్నికల ముందు వారితో రెగ్యూలర్‌గా టచ్‌లో ఉండాలని లోకల్ లీడర్లకు హైకమాండ్ నుంచి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం.
ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేలోపు వారందరిని మంత్రి కేటీఆర్‌తో ఇంటరాక్ట్ చేయాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ప్రతి యూత్ ఓటరు మొబైల్ నంబర్‌కు వాయిస్ కాల్ ద్వారా పార్టీ వివరాలను అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు సీఎం కప్ పోటీలు నిర్వహించిన తర్వాత కొత్త ఓటర్లు ఏం అనుకుంటున్నారు? ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు? విపక్ష పార్టీల విషయంలో ఎలా స్పందిస్తున్నారు అనే విషయంపై సర్వే నిర్వహిస్తున్నట్టు సమచారం. వీరు విపక్షాల వైపు మరలకుండా ఏం చేయాలా? అని ఆరా తీస్తున్నట్టు టాక్.
20 కోట్ల ఖర్చుతో పోటీలు
సీఎం కప్ పోటీలకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అయినట్టు తెలుస్తున్నది. ఇందులో స్పోర్ట్ అథారిటి నుంచి దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చు చేయగా, మిగతా వ్యయాన్ని జిల్లాలకు చెందిన లీడర్లు బరించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ప్రతి కొత్త ఓటర్లను బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్శించాలనే ఉద్దేశ్యంతో ఈ క్రీడలు నిర్వహించారు. ఆటల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కేసీఆర్ బొమ్మతో ముద్రించిన ప్రశంస పత్రాన్ని అందించారు. పక్షం రోజుల పాటు జరిగిన ఈ పోటీలు యూత్ ఓటర్లకు గుర్తుండేలా బీఆర్ఎస్ జెండాలు, కేసీఆర్ ఫొటోలతో హడావుడి చేశారు.