ఫామ్‌హౌస్‌లో ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ..ఆ అంశంలో కీలక చర్చలు!

గులాబీ బాస్ కేసీఆర్ త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా?

Update: 2024-07-11 07:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు కష్టాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు మరోవైపు అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై రేవంత్ సర్కార్ ఎంక్వయిరీలతో గులాబీ పార్టీ సతమతం అవుతున్నది. ఈ నేపథ్యంలో పార్టీ తిరిగి పుంజుకోవడం అంత సులువైన పనేమి కాదనే చర్చ జరుగుతున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ తాజాగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. గురువారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. హరీశ్ రావు నేతలను ఫామ్‌హౌస్ తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. తాజా రాజకీయ పరిస్థితితులు, వలసలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే వారం రోజుల పాటు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న రాష్ట్రానికి తిరిగి వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు భేటీ జరిగిన మరుసటి రోజే పార్టీ ముఖ్యనేతలతో గులాబీ బాస్ సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏం జరుగుతున్నది?

కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్, పార్టీ ఫిరాయింపుల అంశంపై ఎక్స్ పర్ట్స్ తో మాట్లాడారు. అయితే ఓ వైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ టెన్షన్ పెడుతున్న వేళ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కాగా కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లడం వచ్చి రాగానే ముఖ్యనేతలతో సమావేశం కావడంతో పార్టీలో ఏం జరుగుతున్నదనేది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. త్వరలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే టాక్ వినిపిస్తున్నది. ఈ క్రమంలో ఎవరు ఏ టైమ్ లో జలక్ ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి బీఆర్ఎస్ లో కనిపిస్తున్నది. మరో వైపు కవిత జైలుకు వెళ్లి 100 రోజులు దాటిపోయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండగా మరోవైపు తెలంగాణలో టీడీపీ పాగా వేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి తరుణంలో ఇవాళ్టి భేటీ కేసీఆర్ ఏయే అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు? ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది.

Tags:    

Similar News