కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ వార్నింగ్.. ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటనపై స్పందన

తెలంగాణ ప్రజలు తనకు ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఇచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయం గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.

Update: 2024-02-13 12:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలు తనకు ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఇచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయం గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం కేసీఆర్ నల్లగొండ సభలో పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోనని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నడి బజార్లో బట్టలిప్పి నిల్చోబెతామని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు రాలేదని అడిగితే.. చెప్పుతో కొట్టాలని అంటారా? అని కాంగ్రెస్ నేతలపై సీరియస్ అయ్యారు. ఒక్క మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని.. చెప్పులు పంట పండించే రైతుల దగ్గర కూడా ఉంటాయని.. వారిని రాజకీయ నాయకుల కంటే బందోబస్తుగా ఉంటాయని.. ఇష్టానుసారం మాట్లాడితే పళ్లు రాలే వరకు కొడతారని అన్నారు. ఒక్కో నాయకుడు నల్లగొండలో కేసీఆర్ సభ జరుగనివ్వబోమని మాట్లాడుతున్నారని.. తెలంగాణ తెచ్చిన నన్నే తెలంగాణలో తిరగనివ్వరా? అని ప్రశ్నించారు.

దమ్ముంటే తనను ఆపే వాడు ఎవడో రావాలని సవాల్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో తెలివిలేని ప్రభుత్వం ఉందని అన్నారు. స్వయంగా రాష్ట్ర రాజధాని అసెంబ్లీలో పలుమార్లు కరెంట్ పోతోందని.. జనరేటర్లు పెట్టుకొని సభ నిర్వహించుకునే దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనమే అని మండిపడ్డారు. పరిపాలన పక్కనబెట్టి మేడిగడ్డకు పోయారని అన్నారు. చిన్న చిన్న తప్పులు ఉంటే సరిచేయాలి కానీ, రాజకీయంగా వాడుకోవాలని చూస్తారా? అని ప్రశ్నించారు. తాము కూడా మేడిగడ్డకు పోతామని చూసుకుందామని సవాల్ చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. మళ్లీ డబుల్ వేగంతో తాము అధికారంలోకి వస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలకు దండం పెట్టి చెబుతున్నానని.. జరుగుతున్న పరిస్థితిని అర్ధం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని.. తాము ప్రజల పక్షానా పోరాటం చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ను వదలని సమస్యల పరిష్కారానికి వెంటబడుతామని చెప్పారు.

Tags:    

Similar News