లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్.. నేతల ఫోన్లకు స్పందించని కేసీఆర్?
తెలంగాణలో ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల ఊసే ఎత్తడం లేదు. పార్టీ విస్తరణలో భాగంగా గతంలో మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టగా.. అక్కడ కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబర్చడం లేదు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల ఊసే ఎత్తడం లేదు. పార్టీ విస్తరణలో భాగంగా గతంలో మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టగా.. అక్కడ కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబర్చడం లేదు. కనీసం మహారాష్ట్ర నేతలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలిసింది. పార్టీ సమన్వయకర్త వంశీధర్ రావు సైతం నేతల ఫోన్లకు స్పందించడం లేదని సమాచారం. దీంతో కేసీఆర్ ను నమ్ముకొని బీఆర్ఎస్ లో చేరిన చాలా మంది నేతలు.. తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో..
మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ఔరంగాబాద్, నాందేడ్, కందార్ లోహ, లాతూర్, కొల్లాపూర్‌లో బహిరంగసభలు నిర్వహించారు. కేసీఆర్‌ను నమ్మి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎంపీలతోపాటు పలు పార్టీలు, సంఘాల నేతలు గూలాబీ గూటికి చేరారు. దీంతో ఒక్కసారిగా పార్టీలో జోష్ పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు వందలకుపైగా వార్డులు, సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత బహిరంగ సభల్లో కేసీఆర్.. తెలంగాణ మాదిరిగా మహారాష్ట్రను సైతం అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని 48 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని, గెలిపించాలని ప్రజలను కోరారు. అంతేకాకుండా మహారాష్ట్ర పార్టీ ఇన్ చార్జిగా కల్వకుంట్ల వంశీధర్ రావు నేతృత్వంలో 15 మందితో మహారాష్ట్ర తాత్కాలిక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. డివిజన్లకు ఇన్ చార్జిలనూ నియమించారు. 15 లక్షలకు పైగా సభ్యత్వాలను పూర్తి చేశారు. నాగ్ పూర్ లో పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. అన్ని జిల్లాల్లో పార్టీకి సొంతభవనాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ, కార్యకలాపాల గురించి ఊసే ఎత్తడం లేదు.
దొరకని కేసీఆర్ అపాయింట్ మెంట్
పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉండగా.. మహారాష్ట్రలో పోటీపై అక్కడి నేతలకు స్పష్టత దొరకడం లేదు. పోటీపై చర్చిద్దామనుకుంటే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, కనీసం ఫోన్ లో కూడా అందుబాటులోకి రావడం లేదని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. మహారాష్ట్రలో సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న వంశీధర్ రావు కూడా కొంతకాలంగా మౌనం పాటిస్తున్నట్లు తెలిసింది. నేతలు ఫోన్లు చేసినా స్పందించడం లేదని సమాచారం. పోటీచేస్తామని గతంలో ప్రకటించి ఇప్పుడు మౌనంగా ఉండటంపై మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
భవిష్యత్తుపై అయోమయం
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్, శివ్ సంగ్రామ్ పార్టీ, ఎన్డీ మహారాష్ట్ర, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు తమ భవిష్యత్తుపై అయోమయం నెలకొన్నది. పార్టీ మారి తప్పుచేశామా అని మదనపడుతున్నట్లు తెలిసింది. కొంతమంది ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు.
అచేతనంగా సంస్థాగత కమిటీలు
మహారాష్ట్రలోని సోలాపూర్, ఔరంగాబాద్, లాతూర్, హుమ్నాబాద్, బీవండి, నాందేడ్, గడ్చిరోలి, నాగ్ పూర్, థానే, నాసిక్, కల్యాణ్, బీడ్, పర్బణి, సాంగ్లీ, నాసిక్ లో తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉంది. 15కు పైగా సెగ్మెంట్లలో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వివిధ పార్టీల నుంచి నేతలు బీఆర్ఎస్ లో చేరు. అనంతరం 48 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ కమిటీలు కూడా నామ్ కే వాస్తేగా మారాయి.