బిగ్ న్యూస్: కవిత ఈడీ విచారణపై తీవ్ర ఉత్కంఠ.. BRS వర్గాల్లో టెన్షన్.. టెన్షన్!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా.. నేడు జరగనున్న ఈడీ ఎంక్వయిరీకి కల్వకుంట్ల కవిత హాజరవుతారా? లేక ఆబ్సెంట్ అవుతారా? అనేది ఉత్కంఠ రేపుతున్నది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా.. నేడు జరగనున్న ఈడీ ఎంక్వయిరీకి కల్వకుంట్ల కవిత హాజరవుతారా? లేక ఆబ్సెంట్ అవుతారా? అనేది ఉత్కంఠ రేపుతున్నది. ఈనెల 11న మొదటి సారి విచారణకు హాజరైన ఆమె.. 16వ తేదీన సైతం హాజరుకావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆబ్సెంట్ అయ్యారు. తన న్యాయవాదితో పలు డాక్యుమెంట్లను ఈడీ ఆఫీసుకు పంపించారు. అదే రోజున మరో నోటీసు జారీ చేసిన ఈడీ.. ఈనెల 20న వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈడీ ఎంక్వయిరీ నుంచి రిలీఫ్ పొందేందుకు సుప్రీంను ఆశ్రయించిన ఆమెకు కేవియట్‌తో ఈడీ కౌంటర్ ఇచ్చింది. ఈడీ నోటీసు ప్రకారం నేడు ఆమె ఎంక్వయిరీకి వెళ్తారా..? లేదా..? వెళ్తే అరెస్టు అవుతారా? లేక తిరిగి ఇంటికి వస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ జారీ చేసిన నోటీసుకు అనుగుణంగా సోమవారం ఉదయం ఎంక్వయిరీకి హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక విమానంలో ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. భర్త అనిల్‌తో పాటు ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్ కుమార్ సైతం ఆమె వెంట ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆమె విచారణకు హాజరుకావాలాలని నోటీసులో ఉన్నది. విచారణకు హాజరయ్యేందుకే ఆమె ఢిల్లీ వెళ్లారని సన్నిహితులు చెబుతున్నారు.
కానీ చివరి క్షణంలో ఆమె ఎంక్వయిరీకి హాజరవుతారా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. లీగల్ నిపుణుల అభిప్రాయం తర్వాత ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 16న జరిగిన విచారణకు కవిత చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు. ఆమె తరఫున న్యాయవాది భరత్ కుమార్‌ను పంపారు. నిర్దిష్టంగా వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఈడీ స్పష్టంగా చెప్పకపోవడంతో ప్రతినిధిని పంపే చాన్స్‌ను ఆమె వాడుకున్నారు.
ఈసారి అలాంటిది రిపీట్ కాకుండా తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఈడీ నొక్కిచెప్పాల్సి వచ్చింది. ఈ కేసులో కవితకు ప్రతినిధిగా పిళ్లయ్ వ్యవహారం నడిపారని ఆరోపిస్తున్న ఈడీ.. వీరిద్దరిని కలిపి జాయింట్ ఎంక్వయిరీ నిర్వహించాలని భావిస్తున్నది. ఇదే విషయాన్ని మూడు రోజుల క్రితం స్పెషల్ కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ సూచనప్రాయంగా తెలిపారు. కవిత సైతం ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఈ నెల 16న రాసిన లేఖలో జాయింట్ ఎంక్వయిరీ గురించి ప్రస్తావించారు.
మధ్యాహ్నం వరకు పిళ్లయ్‌తో కలిపి..
లిక్కర్ స్కాం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా ఉన్న అరుణ రామచంద్ర పిళ్లయ్‌తో కలిపి కవితను ప్రశ్నించనున్నట్టు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆయన గడువు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియనున్నది. ఈ లోపే వీరిద్దరినీ కలిపి ప్రశ్నించే చాన్స్ ఉన్నది.
ఇప్పిటికే రెండుసార్లు పిళ్లయ్ కస్టడీని పొడిగించినందున మరోమారు స్పెషల్ కోర్టు అవకాశం ఇవ్వకపోవచ్చని ఈడీ న్యాయవాది భావిస్తున్నారు. ఈ కారణంగానే జాయింట్ ఎంక్వయిరీ ప్రక్రియను మధ్యాహ్నం లోపు పూర్తిచేసి పిళ్లయ్‌ను స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నారు. భోజన విరామం తర్వాత కవితను, ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన బుచ్చిబాబును కలిపి ఈడీ అధికారులు జాయింట్‌గా ప్రశ్నించే అవకాశాలున్నాయి.
బుచ్చిబాబుతోనూ..
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, మార్పులు చేర్పులు, టాక్స్ స్ట్రక్చర్‌లో సవరణలు తదితరాల్లో ‘సౌత్ గ్రూపు’ కీలక పాత్ర పోషించిందని ఈడీ ఆరోపిస్తున్నది. ఇందులో భాగంగా జరిగిన సంప్రదింపులు, పాలసీ డాక్యుమెంట్‌ను వాట్సాప్, సిగ్నల్ మొబైల్ యాప్‌ల ద్వారా సౌత్ గ్రూపు సభ్యులకు, లిక్కర్ వ్యాపారులకు చేరినట్టు కొన్ని ఆధారాలను ఈడీ సేకరించింది. పాలసీలో అనుకూలమైన నిబంధనలను పెట్టినందుకు కిక్ బ్యాక్ రూపంలో సౌత్ గ్రూపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు చేరినట్టు కొన్ని వివరాలను సేకరించింది. సౌత్ గ్రూపులో సభ్యురాలిగా కవిత ఉన్నారని ఆరోపించిన ఈడీ అధికారులు ఆమె తరఫున పిళ్లయ్‌ను ప్రతినిధిగా పంపారని పేర్కొన్నారు.
కవితకు బినామీగా పిళ్లయ్ వ్యవహరించారని కూడా వ్యాఖ్యానించింది. వీటన్నింటి నేపథ్యంలో లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూపు తరఫున వీరిద్దరి పాత్రను తగిన ఆధారాలతో జాయింట్‌గానే విచారించాలని ఈడీ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకూ వీరిని విడివిడిగా విచారించిన ఈడీ అధికారులు.. వాస్తవాలను వారి ద్వారానే రాబట్టేందుకు జాయింట్ ఎంక్వయిరీ విధానాన్ని ఎంచుకున్నట్టు సమాచారం.
క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో బుచ్చిబాబు జోక్యం ఉన్నదని ఈడీ అనుమానిస్తున్నందున మధ్యాహ్నం తర్వాత ఆయనతో కలిపి కవితను జాయింట్‌గా విచారించే అవకాశమున్నది. ముడుపుల విషయంలో ఎవరి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యాయనే విషయాలను ఈ సెషన్‌లో ఈడీ రాబట్టాలనుకుంటున్నది. బ్యాంకు స్టేట్‌మెంట్లు, వారి ఆదాయ వివరాలు, ఐటీ రిటన్ తదితరాలనూ విశ్లేషించి ప్రశ్నలను సంధించనున్నది.
అరెస్టుపై అనుమానాలు..
ఈడీ విచారణకు హాజరయ్యే కవితను అరెస్టు చేస్తారంటూ గత వారం నుంచీ చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతల్లోనూ ఇవి విస్తృతంగానే ఉన్నాయి. అందుకే విచారణకు హాజరుకాకుండా కవిత వాయిదా వాస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నెల 16న ఇచ్చిన నోటీసుకు అనుగుణంగా సోమవారం హాజరవుతున్న కవితను అరెస్టు చేస్తారా..? లేక సాయంత్రానికి విడిచిపెడతారా..? అనే చర్చలు ఢిల్లీ స్థాయిలో మొదలయ్యాయి. తొలిసారిగా ఈ నెల 11న విచారించిన ఆమెను.. మరోసారి ప్రశ్నించాలన్న ఉద్దేశంతో ఈనెల 16 తేదీన హాజరుకావాలని ఈడీ అధికారులు కవితకు స్పష్టం చేశారు.
ఆ విచారణకు హాజరయ్యేటప్పుడు ఆర్థిక అంశాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను తీసుకురావాల్సిందిగా సూచించారు. వాటిని సిద్ధం చేసిన ఆమె.. హాజరుకాకుండా, తన న్యాయవాది ద్వారా పంపించారు. సంతృప్తికరమైన సమాధానాలు ఆమె నుంచి రావడంలేదని అనుమానించిన ఈడీ అధికారులు.. జాయింట్ ఎంక్వయిరీ ద్వారా మాత్రమే సమాధానాలు రాబట్టగలమనే నిర్ధారణకు వచ్చారు.
కవితను ఇంటికి పంపించడమా? లేక అరెస్టు చేయడమా అనేది.. విచారణకు కవిత సహకరించే విధానం, అడిగిన ప్రశ్నలకు చెప్పే సమాధానాలపై ఆధారపడి ఉంటుందన్నది దర్యాప్తు సిబ్బంది చెబుతున్న మాట. అనుమానితులు, నిందితులను విచారణకు పిలిచిన ఈడీ.. వారిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. ఇప్పుడు కవిత విషయంలోనూ అదే జరుగుతుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈడీ విచారణకు హాజరుకావడంలో సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగానే ఆమె అరెస్టుపైనా ఉత్కంఠ నెలకొన్నది.
సౌత్ గ్రూపు వివరాలపైనే ఈడీ ఫోకస్
లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో సౌత్ గ్రూపు సభ్యులుగా ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, అరబిందో ఫార్మా శరత్‌చంద్రారెడ్డి తదితరులు పోషించిన పాత్ర, వారి తరఫున రాయబారం నడిపిన పిళ్లయ్, బుచ్చిబాబు, బోయిన్‌పల్లి అభిషేక్ తదితరులకు సంబంధించిన అంశాలపైనే ఈడీ తాజా విచారణలో ఫోకస్ పెట్టనున్నది. సుమారు రూ.100 కోట్ల ముడుపులు విజయ్ నాయర్ ద్వారా ఆప్ పార్టీకి చేరినట్టు ఇప్పటికే ఈడీ ఆరోపించింది.
హైదరాబాద్‌లోని కోహినూర్ హోటల్‌లో, ఆ తర్వాత కవిత నివాసంలో, ఢిల్లీలోని గౌరి అపార్టుమెంటులో, తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో, ఒబెరాయి మెయిడెన్ హోటల్‌లో జరిగిన చర్చలు, మొబైల్ ఫోన్ల ద్వారా జరిగిన చాటింగ్, సిగ్నల్ యాప్ ద్వారా షేర్ అయిన పాలసీ డాక్యుమెంట్, పదుల సంఖ్యలో ఫోన్లను మార్చడం, అందులోని డిజిటల్ ఎవిడెన్సులను ధ్వంసం చేయడం, కిక్‌బ్యాక్ రూపంలో డబ్బులు చేతులు మారడం, సౌత్ గ్రూపు సభ్యులకు ఢిల్లీ రిటెయిల్ జోన్స్ లైసెన్సులు మంజూరు కావడం, మద్యం వ్యాపార సంస్థ ఇండో స్పిరిట్స్‌లో వాటాలు లభించడం.. వీటిన్నింటికి సంబంధించి కవిత, పిళ్లయ్, బుచ్చిబాబు తదితరులతో జరిగే జాయింట్ మీటింగ్‌లో ఈడీ వివరాలను రాబట్టనున్నది.
అవసరమైతే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎంపీ మాగుంట రాఘవ తదితరులతోనూ కలిపి పలువురి మధ్య జాయింట్ ఎంక్వయిరీ జరిగే అవకాశముందని ఈడీ వర్గాల సమాచారం. ఈ కేసు దర్యాప్తులో దాదాపు 80% మేర ఇప్పటికే పూర్తయిందని, వీరి విచారణ పూర్తయితే దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని, ఈ ఎంక్వయిరీ ప్రక్రియ మరిన్ని రోజులు జరిగే అవకాశముందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కవితను ఎవరెవరితో కలిపి విచారిస్తారు? ఎన్ని రోజుల పాటు జరగనున్నది? అరెస్టుకు అవకాశాలున్నాయా? కస్టడీలోకి తీసుకోనున్నారా..? తదితర వివరాలన్నింటిపై సోమవారం సాయంత్రం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశమున్నది.
సుప్రీంకోర్టు పిటిషన్‌తో సంబంధం లేకుండానే..
ఈడీ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని, విచారణకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 24న విచారించనున్నది. ఇప్పటివరకు విచారణ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో సోమవారం హాజరు కావాలని జారీ చేసిన నోటీసు యథావిధిగా అమలు కానున్నది. ఆ పిటిషన్‌తో సంబంధం లేకుండానే ఈడీ ఈ డేట్‌ను ఫిక్స్ చేయడం గమనార్హం. ఈడీ ఇచ్చిన నోటీసులు గమనంలోకి తీసుకున్న కవిత.. సత్వర విచారణ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు.
కానీ వెంటనే విచారణ సాధ్యం కాదని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఆమె హాజరు కావడం అనివార్యమైంది. మరోవైపు ఈ పిటిషన్‌పై హడావుడిగా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుందని భావించిన ఈడీ.. సుప్రీంకోర్టులో ఈడీ కేవియట్ పిటిషన్‌ను ఫైల్ చేసింది. తమను సంప్రదించకుండా, తమ వాదనలను వినకుండా ఉత్తర్వులు జారీ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. దీంతో ఈడీ విచారణకు హాజరుకాకుండా రిలీఫ్ పొందాలని కవిత చేసిన ప్రయత్నం ఫలితమివ్వనట్టయింది. ఎలాగూ ఆమెను విచారించాలనుకుంటున్న ఈడీ.. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా కవితకు వ్యతిరేకంగా గట్టిగానే వాదించాలనుకుంటున్నది. విచారించడానికి ఉన్న ఆవశ్యకతను ఆధారాలతో సహా సుప్రీంకోర్టుకు వివరించాలని భావిస్తున్నది. ఆ పిటిషన్‌తో సంబంధం లేకుండానే కవిత ఎంక్వయిరీ జరుగుతున్నది.
Also Read..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సీరియస్.. నిందితుల నోటితోనే నిజాలు కక్కించేందుకు స్పెషల్ ప్లాన్!