ఏం సాధించారని దశాబ్ధి ఉత్సవాలు : ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం శతాబ్ధ కాలం వెనకబడిందని, మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సాధించిందని శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Update: 2023-05-28 14:51 GMT

సీఎం కేసీఆర్ పాలనలో.. రాష్ట్రం శతాబ్ధ కాలం వెనక్కి

మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకా ఉత్సవాలు

దిశ, జగిత్యాల ప్రతినిధి : బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం శతాబ్ధ కాలం వెనకబడిందని, మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సాధించిందని శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదివారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించడం సిగ్గు చేటన్నారు. మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో అదనంగా ఒక్క ఎకరానికైనా సాగునీరుచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిషన్ భగీరథతో రూ.40వేల కోట్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు మరో రూ.40 వేల కోట్ల భారం ప్రజలపై వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పుట్టబోయే ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు భారం మోపినా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాలు ఎందుకంటూ నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింనందుకు ఉత్సవాలు జరుపుతున్నారా అని ఎద్దేవా చేశారు. నీళ్లకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించామని ఆర్భాటంగా చెప్పుకోవడమే తప్పా.. ఎక్కడ సాగునీటి సౌకర్యం కల్పించారో చూపించాలన్నారు. కేవలం జలాశయాలు నింపడం మినహాయించి, ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూటరీ ఛానళ్ల నిర్మాణం చేపట్టలేదన్నారు. ఇప్పటికీ ఎస్ఆర్ఎస్పీ, శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టు, కృష్ణ జలాలతో సాగు చేస్తున్నారని అన్నారు. విద్యుత్ వినియోగంతో అదనపు సాగు చేస్తున్నారు తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుతో అదనంగా ఒక్క ఎకరం కూడా సాగు అవడం లేదన్నారు.

రూ.40 వేల కోట్ల అప్పుల భారంతో మిషన్ భగీరథ చేపట్టారని, ఇప్పటికీ 50 శాతం ఇళ్లకు కూడా నీరు అందడం లేదన్నారు. ఎక్కడైనా మిషన్ భగీరథ నీరు అందినా తాగేందుకు వినియోగించలేని స్థితిలో ఉన్నాయన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారంతో, రాష్ట్రంపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ఎన్.టీ.పీ.సీ ద్వారా విద్యుత్ ఉత్పాదన పొందే సౌకర్యం కల్పించిందన్నారు. కేవలం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ద్వారా ఏ విధమైన పెట్టుబడి లేకుండా విద్యుత్ వినియోగం పొందే అవకాశం ఉందని తెలిపారు.

2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పొందే అవకాశం ఉండగా, కేంద్రం సహకరించడం లేదంటూ రాష్ట్ర ప్రజల హక్కులను పరిరక్షించలేకపోవడం సీఎం కేసీఆర్ అసమర్థత, వైఫల్యానికి నిదర్శనం కాదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 97,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండగా, పీఆర్సీ బీస్వాల్ కమిటీ గతేడాది 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని నివేదిక సమర్పించిందని గుర్తు చేశారు. ఉద్యోగ ఖాళీలు రెట్టింపు ఐతే ఉద్యోగాలు భర్తీ చేసినట్టా అని నిలదీశారు.

గతేడాది అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేశారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజక వర్గంలో 3వేల ఇళ్ల నిర్మాణం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయించినా ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ లో నిధులు కేటాయించి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ చడీచప్పుడు లేదన్నారు. మళ్లీ ఈ ఏడాది జూలైలో ఇళ్ల నిర్మాణం చేపడుతామంటూ సీఎం కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా బీసీ యాక్షన్ ప్లాన్ అమలు చేసింది శూన్యమని తెలపారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ తో పాటు, స్వయం ఉపాధి కింద ప్రతి సంవత్సరం యాక్షన్ ప్లాన్ అమలు చేయాల్సి ఉండగా, నాలుగేళ్లుగా యాక్షన్ ప్లాన్ అమలు నిలిచిపోయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటైందో.. ఆ ఆకాంక్షలు నెరవేర్చే, లౌకిక తత్వానికి కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ లకు జనాభా ప్రాతిపదికన కేటాయించిన నిధులు ఏ ఏడాది నిధులు ఆ ఏడాదే ఖర్చు చేసేలా, బలహీన వర్గాలు, మైనారిటీల యాక్షన్ ప్లాన్ రూపొందించి, పేదరికాన్ని రుపుమాపే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలుస్తారని జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News