మహిళలను కోటీశ్వరులను చేస్తాంః మంత్రి శ్రీధర్ బాబు

Update: 2024-08-21 16:00 GMT

దిశ,మంథని : మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రూపొందించిందని, మహిళలు వ్యాపారాలలో రాణించి గొప్పగా ఎదగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. బుధవారం మంత్రి శ్రీధర్ బాబు మంథనిలోనే అభివృద్ధి పనుల శంకుస్థాపన, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.24 లక్షల రూ.50 వేల రూపాయలతో మంథని పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు కొనుగోలు చేసిన 3 స్వచ్ఛ ఆటోలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధిలో మంథని పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. టి.యూ.ఎఫ్.ఐ.డి.సి క్రింద రూ.13 కోట్ల 95 లక్షలతో 7 ప్యాకేజీలలో మంథని పట్టణంలోని ప్రతి వార్డుకు సిసి రోడ్లు, సిసి డ్రైయిన్లు కల్పించేలా శంకుస్థాపన చేసుకున్నామన్నారు.

ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. మంథని పట్టణంలో కొత్త పురపాలక భవనం, సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం మొదలగు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు గృహావసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వంటి పలు పథకాలను అమలు చేశామని తెలిపారు. రానున్న 5 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల బ్యాంకు రుణాలు అందజేసి మహిళలచే వివిధ వ్యాపార వాణిజ్య యూనిట్ల స్థాపనకు కృషి చేస్తామన్నారు. మంథని ప్రాంతంలో 40 లక్షలతో 25 మహిళా సంఘాలతో మైక్రో ఎంటర్ ప్రైజెస్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రస్తుతం 165 మహిళా సంఘాలకు 20 కోట్ల 67 లక్షల బ్యాంక్ లింకేజీ రుణం పంపిణీ చేస్తున్నామని, వీటినీ మహిళలు వినియోగించుకుని వ్యాపార రంగంలో ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు విషయంలో స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సూచించారు.మంథని పట్టణంలో నేడు ప్రారంభించిన 3 స్వచ్చ ఆటోలను వినియోగిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడే విధంగా చూడాలని అధికారులకు ఎంపీ సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ, మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ, మంథని ఆర్డీవో వి.హనుమా నాయక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి,ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News