సిబ్బంది లేక అంగన్వాడీ కేంద్రానికి తాళం.. ఆరు నెలలుగా మూతబడి ఉన్న వైనం
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదో వార్డు చిన్న చిన్న
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదో వార్డు చిన్న చిన్న బోనాలలోనీ అంగన్వాడీ కేంద్రంలో టీచర్, ఆయా లేని కారణంగా గత ఆరు నెలల నుండి అంగన్వాడి కేంద్రం మూసి వేశారు. వార్డు కౌన్సిలర్ బొల్గం నాగరాజుతో పాటు స్థానిక ప్రజలు అంగన్వాడి కేంద్రం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. వార్డు పరిధిలో దాదాపు 20 నుంచి 30 మంది ఆరు సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీ మహిళలకు ఉన్నారని, వారికి అంగన్వాడి కేంద్రం ద్వారా అందే సేవలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం పోషణ్, సప్లమెంటరీ న్యూట్రిషన్ స్కీం ద్వారా మహిళలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని, రక్తహీనత రూపుమాపేందుకు ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉత్తమమైన సేవలు అందిస్తున్న సేవలు కూడా వార్డు ప్రజలకు సేవలు అందడం లేదన్నారు. కేవలం సిబ్బంది లేకపోవడంతో గత ఆరు నుంచి ఏడు నెలలుగా వార్డులోని అంగన్వాడీ సర్వీస్ కేంద్రం మూతపడి ఉందని వారు తెలిపారు. వెంటనే సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వార్డు కౌన్సిలర్ నాగరాజు డిమాండ్ చేశారు.