'అమ్మ కిడ్నాప్' కథ సుఖాంతం..క్షేమంగా ఇంటికి..
కొడుకు ఇవ్వాల్సిన డబ్బుల కొరకు అమ్మను కిడ్నాప్ చేసిన కేసును
దిశ, వేములవాడ : కొడుకు ఇవ్వాల్సిన డబ్బుల కొరకు అమ్మను కిడ్నాప్ చేసిన కేసును వేములవాడ పోలీసులు ఛేదించారు. కేసు నమోదైన 24 గంటల లోపే బాధిత మహిళను క్షేమంగా ఇంటికి చేర్చి, కిడ్నాప్ కు కారణమైన వారిని కటకటాల్లోకి పంపారు. ఈ మేరకు గురువారం రాత్రి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ వీర ప్రసాద్ వివరాలు వెల్లడించారు.
వేములవాడ అర్బన్ మండలంలోని కొడిముంజ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన పల్లపు శ్రీను, వెంకటేష్, మహారాష్ట్రకు చెందిన లాలు నాగోరావ్ దయారంగలోడ్ లతో పాటు కొంతమంది వ్యక్తులు కూలీ పనులు చేయడానికి కూలీల కోసం ఒప్పందం చేసుకొని లాలు నాగోరావ్ దయారంగ లోడ్ వద్ద పల్లపు శ్రీను డబ్బులు తీసుకొని కూలీలను పంపకపోవడం తో వారి మధ్యలో డబ్బులు విషయంలో గొడవలు జరిగాయి.పల్లపు శ్రీను వద్ద ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశ్యంతో లాలూ నాగోరావ్ దయారంగ లోడ్,అతని భార్య పంచతుల,మరో నలుగురు వ్యక్తులు బుధవారం కొడిముంజకు రోజున చేరుకోగా ఇంటి వద్ద పల్లపు శ్రీను లేకపోవడంతో అతని తల్లి అయిన భీమాబాయి ని కిడ్నాప్ చేసి మహారాష్ట్రలోని నాందేడ్ కు తీసుకెళ్లారు.
భీమాబాయి మనవడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక బృందాలను నాందేడ్ కు పంపించి, అక్కడి పోలీసులు సహకారంతో ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కేవలం 24గంటల్లోనే కేసును ఛేదించిన వేములవాడ పోలీసులను జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అభినందించారు.