పట్టణ పారిశుధ్యం మెరుగుపర్చాలి

మంథని పట్టణంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చాలి అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

Update: 2024-07-04 10:51 GMT

దిశ, పెద్దపల్లి : మంథని పట్టణంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చాలి అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని పురపాలక కార్యాలయంలో పట్టణ పారిశుధ్య నిర్వహణపై వార్డు అధికారులు, శానిటేషన్ సూపర్ వైజర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని పట్టణంలోని 13 వార్డులలో ఆశించిన స్థాయిలో పారిశుధ్య నిర్వహణ లేదని, రోడ్లపై చెత్త, డ్రైయినేజీ లీకేజీలు ఉన్నాయని అన్నారు. రోడ్లపై నీటి నిల్వలు అధికంగా ఉన్నాయని, దోమల నివారణ చర్యలు కూడా ఆశించిన స్థాయిలో జరగడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

    15 రోజుల వ్యవధిలో పట్టణ పారిశుధ్యంలో గణనీయమైన మార్పులు రావాలని, ఇకపై ప్రతి రోజూ ఉదయం వార్డ్ అధికారులు, శానిటేషన్ సూపర్ వైజర్ లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించాలని కోరారు. ప్రతి రోజూ రోడ్లను శుభ్రం చేయాలని, డ్రైనేజీలను క్లీన్ చేయాలని, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంథని పట్టణంలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిషేధించేలా

     చూడాలని, రోడ్డుపై ఎక్కడ ప్లాస్టిక్ చెత్త కనిపించవద్దని, డ్రైనేజీ నీటి ప్రవాహం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ శుభ్రం చేయాలని, పట్టణంలో ఉన్న పిచ్చి మొక్కలను పూర్తి స్థాయిలో తొలగించాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Similar News