ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ డివిజన్ పోలీసులు ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేశారు.
దిశ, తాండూర్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ డివిజన్ పోలీసులు ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేశారు. కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కాగజ్‌నగర్ రూరల్ సీఐ నాగరాజు, పెంచికల్ పేట ఎస్సై విజయ్ సిబ్బందితో కలిసి అగర్ గూడ గ్రామ శివారు గుట్టల వద్ద శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
పెంచికలపేట్ మండలం మురళిగూడ గ్రామ పంచాయతీ జిల్లెడ గ్రామానికి చెందిన కోట ఆనంద్ రావు, నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోరిటికల్ గ్రామానికి చెందిన చేన్నగొని గణేష్ లను బెజ్జూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సీపీఐ మావోయిష్టు పార్టీకి సానుభూతి పరులుగా పని చేస్తున్నామని తెలిపారు.
దళంలో చేరేందుకు సభ్యులను రిక్రూట్ చేస్తున్నామని, వారు వచ్చినప్పుడు వారికి వస్తువులు కొనిపెట్టటం, వాటిని సరఫరా చెయడం, భోజనం పెట్టటం, గ్రామాల్లో ఉన్న మిలిటెంట్ లను పార్టీకి అనుకూలంగా పనిచేసే విధంగా చేస్తున్నమని ఒప్పుకున్నారని ఎస్పీ చెప్పారు. సీపీఐ మావోయిస్టు పార్టీ తరుపున కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేసి ఇస్తున్నరని తెలిపారు.
వారికి సీపీఐ మావోయిస్టు పార్టీ పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, మైలారపు అడేల్లు అలియాస్ భాస్కర్, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్, రాధక్క, మున్న, వర్గీష్, మనీష్, రమణ అలియాస్ చెన్నూరి శ్రీనివాస్ సహా మరి కొంతమందితో పరిచయాలు ఉన్నట్లు వారు తెలిపారు. అప్పుడప్పుడు మావోయిస్టు గ్రామాలకు వచ్చినప్పుడు, గడ్చిరోలి అడవీ ప్రాంతంలో, ఛత్తీస్-ఘడ్ అడవీ ప్రాంతానికి వెళ్లి కలిసేవారు.
అదేవిధంగా గణేశ్ ను కూడా సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరితే బాగుంటుందని కోట ఆనందరావు తనను ప్రోత్సహించినట్టు గణేష్ తెలిపడంతో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద నుంచి 5 జిలేటిన్ స్టిక్స్, 15 డిటోనేటర్లు, పార్టీ ధ్రువ పత్రాలు, రెండు సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నమని ఎస్పీ తెలిపారు. మావోయిస్టులకు ఎవరు సహకరించిన ఆశ్రయం కల్పించిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర రావు, కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, కాగజ్ నగర్ రూరల్ సీఐ నాగరాజు, పెంచికల్ పేట్ ఎస్ఐ విజయ్, కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐ సోనియా, తదితరులు పాల్గొన్నారు.