భానుడి భగ భగ.. ఏప్రిల్‌కు ముందే దంచికొడుతున్న ఎండలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి.

దిశ, కరీంనగర్ టౌన్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగ భగలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణంగా మార్చిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలకు భిన్నంగా ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. సాధారణం కంటే 3.3డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఉదయం 11గంటలు దాటిందంటే చాలు రోడ్డు మీదకు రావాలంటే జంకుతున్నారు.
రోడ్లన్నీ నిర్మానుషం..
ఎండల తీవ్రతతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. 12 గంటలు దాటిందంటే జనంతో రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ జనం లేక వెలవెలబోతున్నాయి. మిట్ట మధ్యాహ్నం రోడ్లపై జనం లేక కర్ప్యూను తలపిస్తున్నాయి. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపు వారి పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి...
సహజంగా ఏప్రిల్‌లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి 2వ వారంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రత అధికం కావడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే లో ఎలా ఉంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం.. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తూ ఎండ తీవ్రత నుంచి తమను తాము కాపాడుకుంటూ ఎండదెబ్బకు గురికాకూడదని హెచ్చరిస్తున్నారు.