ధాన్యం మిల్లర్ల దగా..! రూ.కోట్ల ప్రభుత్వ ధనంతో అక్రమ వ్యాపారం

గత పాలకుల అసమర్థతో రైస్ మిల్లుల వ్యాపారులు రూ.వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దారి మళ్లించి ప్రభుత్వానికి కుచ్చుటోపి పెట్టారు.

Update: 2024-07-04 02:33 GMT

దిశ బ్యూరో, కరీంనగర్ : గత పాలకుల అసమర్థతో రైస్ మిల్లుల వ్యాపారులు రూ.వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దారి మళ్లించి ప్రభుత్వానికి కుచ్చుటోపి పెట్టారు. వ్యాపారులతో అధికారులు చేతులు కలపడంతో గత పదేళ్లుగా అక్రమ దందా యథేచ్చగా కొనసాగించారు. అలా ప్రభుత్వ ధనాన్ని దారి మళ్లించేందుకు దళారులు రైస్ మిల్లులను లీజుకు తీసుకుని ధాన్యాన్ని మిల్లులకు తరలించుకున్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉండగా మార్కెట్లో అమ్ముకుని రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు.

అయితే, అప్పటి అధికారులు మిల్లులకు తరలించిన ధాన్యం ఎటు తరలిపోతుందనే విషయాన్ని విస్మరించి మిల్లర్ల మాయలో పడటంతో కోట్ల రూపాయల ప్రజాధనం కొంత మంది వ్యాపారులు కొట్టేసి రూ.కోట్లకు పడగలెత్తారు. అయితే మారిన ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ పై ప్రత్యేక దృష్టి సారించి లోతుగా పరిశీలించడంతో కోట్ల రూపాయల సీఎంఆర్ పెండింగ్ విషయం వెలుగులోకి వస్తు మిల్లర్లు ధాన్యంతో ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయలు దగా చేసిన విషయం యావత్ సమాజాన్ని నివ్వెర పరుస్తుంది. అయితే అక్రమ దందాకు కేంద్ర బిందువుగా మారిన కరీంనగర్ లో కొంతమంది మిల్లర్లు అప్పటి అధికార పార్టీ నేతల భాగస్వామ్యంతో సాగడం అప్పటి ఖద్దరునేతల్లో కలవరం మొదలైంది.

మిల్లర్ల అక్రమాల్లో అధికారులే కీలకం!

రైతుల వద్ద సేకరించి మిల్లులకు తరలించిన ధాన్యం లెక్కలు చూడటంలో అధికారుల అలసత్వం మిల్లర్ల అక్రమాలకు ఆజ్యం పోసినట్టు అయ్యింది. మిల్లులకు తరలించిన ధాన్యం సకాలంలో మిల్లరు మిల్లింగ్ చేస్తున్నారా లేదా అని పర్యవేక్షించాల్సిన అధికారులు అది విస్మరించారు. సీజన్ వారిగా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వకపోయినా అధికారులు వారికే తిరిగి ధాన్యాన్ని కేటాయించడం సంవత్సరాల తరబడి సీఎంఆర్ పెండింగ్ పెట్టినా ఎందుకు పెండింగ్ ఉందో మిల్లరు ధాన్యాన్ని భద్రపరిచారా లేక దారి మళ్లించారనే విషయాన్ని పట్టించుకోకుండా ప్రతి సీజన్ లో ధాన్యాన్ని ఆ మిల్లర్లకు కేటాయించడం మిల్లర్ల అక్రమాల్లో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.

అయితే ఇదే అదనుగా మిల్లర్లు కోట్ల రూపాయల ధాన్యాన్ని మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం అంతా అధికారులకు తెలిసినప్పటికీ వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసించలేదు. వెరసి వేలకోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కొట్టేసిన మిల్లర్లు తమ వ్యాపారాలను పెంపొందించుకున్నారు. తాజాగా పరారీలో ఉన్న జమ్మికుంటకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ.120 కోట్లు కుచ్చుటోపి పెట్టి 5 ఎకరాల్లో పాల డెయిరీ పెట్టడం మిల్లర్లు ప్రభుత్వ సొమ్ముతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నారనే దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది.

ధాన్యాన్ని దారిమళ్లించిన మిల్లర్లు

మిల్లర్లు ధాన్యాన్ని దారి మళ్లించేందుకు అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకోవడంతో పాటు అప్పటి అధికార పార్టి నేతలను భాగస్వాములను చేశారు. అధికార పార్టీ నేతలు ఉండటంతో అధికారులు సైతం మిల్లర్ల అక్రమాలకు అండగా నిలిచారు. సీఎంఆర్ పెండింగ్ లో పెట్టి ఆ బియ్యాన్ని మార్కెట్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. తిరిగి సీఎంఆర్ పెట్టేందుకు పీడీఎస్ రైస్ ను తరలించే వెసులుబాటు కల్పించారు. దీంతో ధాన్యం మాత్రమే ఫిజికల్ గా మిల్లులకు తరలగా మిగతా తతంగం అంతా పేపర్లపై సాగింది. లెక్కలన్నీ అధికారులు పేపర్లలో చూపించి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారు. అయితే మిల్లర్ల అక్రమ దందాలో అధికార పార్టీ నేతల హస్తం ఉండటంతో ఎక్కడా కూడా అనుమానం రాకుండా అక్రమ దందాను యథేచ్చగా సాగించారు. ఇలా కొనసాగిన దందాతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడగా వేలకోట్ల రూపాయల ధనం కొంతమంది మిల్లర్ల సొంతమైంది.


Similar News