చేతికొచ్చిన పంట ఎండిపోతున్న వైనం.. పశుగ్రాసంగా మారిన వరి

ఆరుగాలం కష్టించి పండించిన పంటకు నీరు అందక భూగర్భ జలాలు

Update: 2025-03-15 06:05 GMT

దిశ,మల్యాల : ఆరుగాలం కష్టించి పండించిన పంటకు నీరు అందక భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తమ పంటలు ఎండిపోయినట్లు మల్యాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన వరి పైరు పశువులకు గాసంగా మారిందని పెట్టుబడి పూర్తిస్థాయిలో మునిగిపోయామని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. గతంలోనే కరువును గ్రహించిన రైతులు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉపకాల్వల నిర్మాణం ద్వారా తమకు అందుబాటులో ఉన్న చెరువులను నింపి తాగునీరు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వం ప్రతిపాదనలు వచ్చి సర్వే పూర్తి కాకపోవడంతో నత్త నడకన సాగిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సర్వే నిర్వహిస్తున్న సమయంలో ఇతర గ్రామాల చెందిన కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు గ్రహించిన మల్యాల రైతులు గతంలో కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. సర్వే నిర్వహించి ఎల్లంపల్లి ఉప కాలువ నిర్మాణం పూర్తి చేసి చెరువులు నింపి సాగునీరును అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వ అధికారులు ఇచ్చిన హామీని మరవడంతో ఇప్పుడు ఈ సమస్య తలెత్తిందని రైతులు తెలుపుతున్నారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు స్పందించి ఎల్లంపల్లి ఉప కాలువల నిర్మాణం చేపట్టి తమకు అందుబాటులో ఉన్న చెరువును నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి తమ పంట సాగుకు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.


Similar News