రోగులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించాలి
సీజన్ మార్పుతో అంటువ్యాధులు, వైరల్ జ్వరాల బారిన పడిన రోగులకు అత్యుత్తమ చికిత్స అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. ప్రమోద్ ను ఆదేశించారు.
దిశ,మంథని : సీజన్ మార్పుతో అంటువ్యాధులు, వైరల్ జ్వరాల బారిన పడిన రోగులకు అత్యుత్తమ చికిత్స అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. ప్రమోద్ ను ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలకు దోమలు విపరీతంగా పెరిగాయని, వాటి నిర్మూలనకు యాంటీ లార్వల్ కార్యక్రమాలు ప్రతి గ్రామం, మున్సిపాలిటీల పరిధిలో చేపట్టాలని ఆయన కోరారు. బుధవారం ఆయన డా.ప్రమోద్ కు ఫోన్లో పలు సూచనలు చేశారు. జిల్లాలో జ్వర పీడితులు,ఇతర వైరల్ వ్యాధులు సోకిన వారిని గుర్తించి మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఉత్తమ చికిత్సా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అన్నారు.
200 పడకలు ఉన్న సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అన్ని స్పెషాలిటీల వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. మంథనిలోని 50 పడకల హాస్పిటల్ లో సిబ్బంది కొరత లేకుండా ఖాళీలన్నీ భర్తీ చేయాలని ఆదేశించారు. మందుల లభ్యత సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 70 ప్రభుత్వ హాస్టళ్లను వైద్య బృందాలు సందర్శించి జ్వర పీడితులను హాస్పిటల్ కు తరలించాలని కోరారు. శీతాకాలం మొదలైనా వర్షాలు కురుస్తూనే ఉన్నందున వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు. మెడికల్ క్యాంపులు నిర్వహించి రోగుల వద్దకే వైద్య సేవలు వెళ్లేలా రూట్ మ్యాప్ రూపొందించాలని అన్నారు. జిల్లాలో 108 అంబులెన్సులు, 104 సంచార వైద్యశాలల వాహనాలు అన్నీ తిరిగేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు.