పోలీస్ స్టేషన్ నుండి పరారైన నిందితుడు.. ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు..
చందుర్తి పోలీస్ స్టేషన్ నుండి ఓ వ్యక్తి తప్పించుకున్నట్లు సమాచారం. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేశాడు.
దిశ, చందుర్తి : చందుర్తి పోలీస్ స్టేషన్ నుండి ఓ వ్యక్తి తప్పించుకున్నట్లు సమాచారం. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేశాడు. దాని పై కేసు నమోదు చేసిన పోలీసులు సదరు నిందితునితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అయితే స్టేషన్ కు వచ్చిన నిందితుల్లో ఒకరు కొద్దిసేపట్లోనే ఏదో కారణం చెప్పి పోలీస్ స్టేషన్ నుండి పరారయ్యాడు. కాగా అక్కడ పనిచేస్తున్న ఓ సిబ్బంది సహకారంతోనే సదరు నిందితుడు పరారైనట్లు సమాచారం. దీనికి ప్రతిఫలంగా పారిపోయిన వ్యక్తి మరో వ్యక్తి సహాయంతో కానిస్టేబుల్ కు మద్యం పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న పోలీసులు..?
అయితే పోలీస్ స్టేషన్ లో ఈ సంఘటన జరిగి సుమారు పది రోజులు గడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు గడుస్తున్నా సమాచారం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్త పడ్డట్లు తెలిసింది. కాగా ఇంత పెద్ద ఇష్యూని పోలీసులు గోప్యంగా ఉంచుడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ దృష్టికి ఈ విషయం వెళ్లిందా లేదా....? ఒక వేళ వెళ్ళినా వారు ఈ విషయాన్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారనే విషయాల పై స్పష్టత రావాల్సి ఉంది.
విచారణ చేపడుతున్నాం.. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు..
అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల పై కేసు నమోదు చేశాం. కానీ అందులో ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. పరారీకి సహకరించిందెవరనే దాని పై విచారణ చేపడుతున్నాం. అయితే సదరు నిందితుడి పై ఇప్పటికే రౌడీ షీట్ ఉన్న క్రమంలో స్టేషన్ కి సంతకం పెట్టడానికి వచ్చి వెళ్లినట్లు తెలిసింది. నిందితుడి కుటుంబ సభ్యుల పై వచ్చిన ఫిర్యాదుతో వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించాం. ఈ విషయం పై సమగ్ర విచారణ చేపడుతున్నాం. విచారణ అనంతరం రిపోర్టు జిల్లా ఎస్పీకి పంపిస్తాం. తదుపరి చర్యలు ఆయనే తీసుకుంటారు అంటున్నారు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు.