భక్త జన సంద్రమైన మల్లన్నపేట..

మండలంలోని మల్లన్న పేట గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే దొంగ మల్లన్న జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2024-12-22 08:11 GMT

దిశ, గొల్లపల్లి : మండలంలోని మల్లన్న పేట గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే దొంగ మల్లన్న జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజున ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయాన్నే వచ్చిన భక్తులు కొత్త కుండలో కొత్త బియ్యంతో బెల్లం అన్నం వండి శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ళ మధ్య స్వామి వారికి నైవేద్యం తో పాటుగా స్వామి వారికి ఎంతో ప్రీతి పాత్రమైన బండారు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ..

దొంగ మల్లన్న స్వామిని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదివారం రోజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరికి వేద వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలకగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి నిలువెత్తు బంగారంతో తులాభారం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరి వెంట ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురంశెట్టి గౌతమ్, స్థానిక నాయకులు బేరా కిషోర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News