నీటి కోసం ఎదురు చూపులు.. ప్రశ్నార్థకంగా రబీ సాగు..
రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు.
రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కాలువల్లో నీళ్లు లేకపోవడంతో రబీ సాగు ప్రశ్నార్ధకంగా మారుతోంది. శంకరపట్నం మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఏటా రబీ సీజన్ లో లోయర్ మానేరు డ్యాం ద్వారా వచ్చే నీటీతో రైతులు పంటలు సాగు చేస్తుంటారు. ఇప్పటికే పలు గ్రామాల రైతులు నారుమళ్లు పోశారు. సీజన్ దాటుతున్నా.. అధికారులు డ్యాం ద్వారా నేటికీ నీటిని విడుదల చేయకపోవడంతో నారు ముదిరి నాటు వేసేందుకు అవకాశం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదల పై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో బార్లు, బావుల కింద రబీ పనులు చకచకా సాగుతుండగా.. ఆయకట్టు పరిధిలో నీటి విడుదల లేకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది.
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు కాకతీయ కాలువ నీటి కోసం ఎదురుచూస్తున్నారు. లోయర్ మానేరు డ్యాం ద్వారా వచ్చే నీటీతో వివిధ మండలాలలోని రైతులు పంట పొలాలను సాగు చేస్తుంటారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రబీ సీజన్ ప్రారంభం కాగానే నారుమళ్ళు పోసుకున్నారు. కానీ నేటికీ కాలువ నీరు రాకపోవడంతో ఏపుగా పెరిగిన నారుమడులు ముదిరిపోయి నాటు వేసుకోవడానికి పనికి రాకుండా పోయే పరిస్థితి ఉందని రైతన్నలు వాపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది రైతులు నవంబర్ చివరిలోనే నారు పోసుకున్నట్లు తెలిపారు.
కానీ ఎస్ఆర్ఎస్‌పీ అధికారులు మాత్రం డిసెంబర్ 30 లేదా జనవరి ఒకటిన కాలువ ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. కొంచెం ముందుగా విడుదల చేస్తే పంటల దిగుబడి పెరిగేదని ఆలస్యంగా నీరు విడుదల చేస్తే పంటలు వేసుకోవడం ఆలస్యం అవుతుందని.. దీనితో పంటకాలం పెరిగి కోతలు కోసే సమయానికి వడగండ్ల వానలు పడి నష్టపోయే పరిస్థితి వస్తుందన్నారు. ఎస్సారెస్పీ అధికారులు రైతులకు ఫలానా రోజు నుంచి నీటి సరఫరా ఉంటుందని ముందస్తుగా తెలియజేయకపోవడం వల్ల తొందరపడి నారు పోసుకున్న రైతులు నష్టపోతామంటున్నారు. మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవ తీసుకొని కాలువ నీరు వీలైనంత తొందరగా విడుదల చేయించాలని రైతులు వేడుకుంటున్నారు.
దిగుబడులు తగ్గే అవకాశం.. రాజ కొమురయ్య, గొల్లపల్లి
కాలువ నీటి విడుదల పై సరైన సమాచారం లేకపోవడంతో ముందుగా పోసుకున్న నారు మడులు ముదిరిపోయి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది రైతు
నీటిని విడుదల చేయాలి.. కాసు మచ్చయ్య, రైతు కొత్తగట్టు గ్రామం
లోయర్ మానేరు డ్యాం ద్వారా ఇప్పటికే కాలువ నీరు విడుదల ఆలస్యమైంది. వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.