ఆదివారం వచ్చిందంటే చాలు..రెచ్చిపోతున్న పేకాటరాయుళ్లు..
కాలక్షేపం కోసం మొదలైన పేకాట వ్యసనంగా మారుతున్నది.
కాలక్షేపం కోసం మొదలైన పేకాట వ్యసనంగా మారుతున్నది. మూడు ముక్కలాటలో ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు. సర్వస్వం పోగొట్టుకుని అప్పులపాలవుతున్నారు. డబ్బు పోగొట్టుకుని ఆవేదనలో మద్యానికి బానిసవుతున్నారు. ఎల్లారెడ్దిపేట, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ సర్కిళ్ల పరిధిలో కొంత కాలంగా పేకాట మూడు ముక్కలు, ఆరు రూకలుగా కొనసాగుతోంది. ప్రతీ ఆదివారం రూ. లక్షల్లో చేతులు మారుతున్నది. పోలీసులు దాడులుచేస్తూ కేసులు నమోదు చేసినా పలువురు అడ్డాలు మారుస్తూ ఆటను కొనసాగిస్తున్నారు. అవారాగాళ్ల నుంచి బడాబాబుల వరకు జోరుగా పేకాట ఆడుతున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు మూడుముక్కలాటలో మునిగితేలుతున్నారు. సరదాకు ఆడుకునే పేకాట కొందరికి వ్యసనంలా మారుతోందని పలువురు పేర్కొంటున్నారు.
దిశ, ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్దిపేట, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ సర్కిళ్ల పరిధిలో గల మండలాల్లో జోరుగా మూడు ముక్కలాట నడుస్తుంది. ఆదివారం వస్తే చాలు రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు ముక్కలాట మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది. ఒక పక్క పోలీసులు తీవ్రంగా నిఘా పెట్టినా పేకాట మాత్రం ఆగడం లేదు. వ్యాపారస్తులకు ఆదివారం సెలవు దినం కావడం వల్ల మూడు ముక్కలాట పై మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వయంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కొలని మొగిలి రైతు వేషం వేసుకుని పోలీస్ బృందంతో సహా వెళ్లి పట్టుకున్నా ముస్తాబాద్ మండలంలో మూడు ముక్కలాట ఆడుతూ ఏదో ఒక గ్రామంలో పట్టుబడుతుండడం విశేషం. అదే విధంగా ఎల్లారెడ్డిపేట మండలంలో పేకాట ఆడేవారు రెండు మార్గాలను ఎంచుకుంటున్నారు. శివారు ప్రాంతాలను పేకాట స్థావరాలుగా మార్చుకుని ఆడుతుండగా గతంలో స్థానిక పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులకు ఎలాంటి అనుమానాలు రాకుండా ఇండ్ల మధ్య కొంతమంది పేకాట బ్రోకర్లు గా మారి పేకాట పాపారావులను చేరదీసుకుని కమీషన్ పద్దతిలో ఆట అడిస్తున్నట్లు సమాచారం.
పట్టుబడిన చోట దొరికే సొమ్ము తక్కువే..
మూడు ముక్కలాట ఆడుతూ అడపా దడపా పోలీసులకు పేకాట రాయుళ్ళు పట్టుబడిన చోట తక్కువ మొత్తంలో నగదు దొరుకుతుంది. పేకాట రాయుళ్ళు మాత్రం ఆట ఆడుతున్న సమయంలో పోలీసులకు నగదు చిక్కకుండా ఫోన్ పే లేదా గూగుల్ పే విధానంలో ఆన్ లైన్ పద్దతిలో నగదు మార్చుకోకుండా డబ్బుల మార్పిడి చేసుకుంటున్నారు.
పేకాట.. సంసారం మూడు ముక్కలాట..
ఆదివారం వస్తే చాలు పేకాటతో అనేక మంది పేకాట రాయుళ్ల సంసారాలు మూడు ముక్కలవుతున్నాయి. ఇప్పటికి మూడు ముక్కలాట చేయబట్టి అనేక మంది ఇండ్లు, వ్యవసాయ పొలాలు సైతం పేకాట ఆడి నష్టపోయి తక్కువ ధరకు అమ్ముకుని రోడ్డున పడుతున్నారు. పేకాట పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మహిళలు కోరుతున్నారు.