రేపే సింగరేణి ఎన్నికలు.. గెలుపు ధీమాలో జాతీయ కార్మిక సంఘాలు
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
దిశ, గోదావరిఖని : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడించనున్నట్లు హైదరాబాద్ రీజినల్ డిప్యూటీ లేబర్ కమిషనర్, ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు సంస్థ వ్యాప్తంగా 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ మేరకు 39,773మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ సింగరేణిలోని అంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈసారి టీబీజీకేఎస్ యూనియన్ ఎటువంటి నాయకత్వం లేకుండానే, ప్రచారం చేయకుండానే పోటీలో నిలబడుతున్నది.
మొత్తం 13 కార్మిక సంఘాలు పోటీ చేస్తుండగా, ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ యూనియన్ల మధ్యనే గట్టి పోటీ నెలకొన్నది. తామంటే తామే అని గెలుపు ధీమా తో ఉన్నాయి. కాగా, ఆర్జీ-1 డివిజన్‌లో 5,430 మంది ఓటర్లు, ఆర్‌జీ-2లో 3,479, రామగుండం 3లో 3063, ఏపీఏలో 944, బెల్లంపల్లిలో 985, మందమర్రిలో 4876, శ్రీరాంపూర్‌లో అత్యధికంగా 9,124, కొత్తగూడెం కార్పొరేట్‌లో 1192, కొత్తగూడెం డివిజన్‌లో 2,370, మణుగూరులో 2414, ఇల్లందులో 603, భూపాలపల్లిలో 5350 మొత్తం 39,773మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో ఇక జాతీయ కార్మిక సంఘాలు కార్మికులను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆయా గనుల మీద ఫిట్ సెక్రెటరీలు షిఫ్టుల వారీగా విధులు ముగించుకుని వెళ్లిపోయే కార్మికులకు ప్రత్యేకంగా విందు ఏర్పాట్లు చేపట్టారు. మొత్తంగా కోల్ బెల్ట్ పరిధిలో కార్మికులకు మద్యం ఎరగవేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు.