సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ దౌర్జన్యం

ఒక టెండర్ విషయంలో కాంట్రాక్టర్లు గ్రూప్‌గా ఏర్పడి బరితెగించారు.

Update: 2023-12-30 11:09 GMT

దిశ, గోదావరిఖని: ఒక టెండర్ విషయంలో కాంట్రాక్టర్లు గ్రూప్‌గా ఏర్పడి బరితెగించారు. తమతో కలవకుండా ఆన్లైన్‌లో టెండర్ వేసిన నలుగురు సివిల్ కాంట్రాక్టర్లపై దౌర్జన్యం కు పాల్పడిన సంఘటన గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటన సింగరేణి రామగుండం-1 డివిజన్‌లో కలకలం సృష్టించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... సింగరేణి రామగుండం 1 ఏరియా పరిధిలో సింగరేణి ప్రైమరీ పాఠశాల మరమ్మతు పనులకు సంబంధించి యాజమాన్యం సివిల్ కాంట్రాక్టర్ల వద్ద నుంచి ఆన్ లైన్ ద్వారా టెండర్లు పిలిచింది. అయితే ఈ పనులను దక్కించుకునేందుకు సింగరేణి సివిల్ కాంట్రాక్టర్‌లు ఒక రింగుగా ఏర్పడ్డారు.

అయితే వీరిలో నలుగురు కాంట్రాక్టర్లు వీరగంటి నరేందర్, సీహెచ్ విజయ్ కుమార్, మారం సమ్మయ్య, నరేష్‌లు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా సివిల్ కాంట్రాక్టర్లు ఒకటై అ టెండర్‌ను వాపస్ తీసుకోవాలంటూ కొద్దిరోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం 40 మంది సివిల్ కాంట్రాక్టర్లు కలిసి టెండర్ విషయంలో మాట్లాడుదామని ఆ నలుగురు కాంట్రాక్టర్లను ఫోన్లో సంప్రదించారు. తాము స్థానికంగా లేమని నరేందర్ అనే కాంట్రాక్టర్ చెప్పినప్పటికీ వినకుండా మార్కండేయ కాలనీలోని అతని ఇంటి మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు. అంతు చూస్తా మంటూ హెచ్చరించారు. దీంతో భయకంపితులైన సదరు కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులు హుటాహుటిన గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై సుగుణాకర్ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సింగరేణి సివిల్ టెండర్ల విషయంలో కాంట్రాక్టర్లు భౌతిక దాడులకు పాల్పడేందుకు తెగించిన సంఘటన అటు సింగరేణిలో కలకలం సృష్టిస్తుంది. ఈ సంఘటన పై సింగరేణి ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. టెండర్ విషయంలో తోటి కాంట్రాక్టర్ ఇంటిపై దాడికి పాల్పడేందుకు ఒడిగట్టిన సివిల్ కాంట్రాక్టర్లపై యాజమాన్యం చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.


Similar News