ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి... నిరాశ చెందిన కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి శనివారం కోరుట్ల మండలంలో నిర్వహించిన పాదయాత్ర... Revanth padayatra
దిశ, కోరుట్ల రూరల్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి శనివారం కోరుట్ల మండలంలో నిర్వహించిన పాదయాత్ర హడావుడిగా సాగింది. ధర్మారం చేరుకున్న రేవంత్ పార్టీ జెండా ఎగురవేసి పాదయాత్ర ప్రారంభించారు. అయిలాపూర్, కిషన్ రావ్ పల్లె చేరుకోగానే మహిళలు, కార్యకర్తలు రేవంత్ రెడ్డికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. కాగా ధర్మారంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కార్యకర్తలు రేవంత్ అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో నిరాశ చెందారు. అలాగే అయిలాపూర్ గ్రామంలో గల అంబేడ్కర్, జగ్జీవన్ రామ్, జాంబవంతుడు విగ్రహాల వద్ద పూలదండలతో వేచి ఉన్న కార్యకర్తలు రేవంత్ రెడ్డి కనీసం అటువైపు చూడకుండా వెళ్లిపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక యాత్రలో రేవంత్ ఇలా హడావుడిగా వచ్చి వెళ్లిపోవడం చర్చనీయమైంది. అయితే కోరుట్లకు చేరుకున్న అనంతరం కోరుట్ల బస్ స్టాండ్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ప్రసగించనున్నారు.
గరీబోళ్ల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యండి
గరీబోళ్ల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా అయిలాపూర్ నుండి పాదయాత్ర కొనసాగించిన రేవంత్ మార్గ మధ్యలో కిషన్ రావుపల్లె గ్రామంలోని మ్యాదరి రాజయ్య కుటుంబాన్ని కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ రూ.500 లకే అందిస్తామని మరియు మేదరి కులస్తులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పేదల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, అందుకే చేతి గుర్తుకు ఓటెయ్యాలంటూ రాజయ్య కుటుంబంతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఆయన వెంట కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ జువ్వాడి నర్సింగరావు, నాయకులు జువ్వాడి కృష్ణారావు తదితరులు ఉన్నారు.