తపాలా శాఖ ఉద్యోగి ఘరానా మోసం.. లక్షల్లో ఖాతాదారులకు టోకరా

గ్రామీణ ప్రజలు చాలావరకు పేద, మధ్యతరగతి కుటుంబాలకు

Update: 2024-05-20 09:51 GMT

దిశ,గొల్లపల్లి : గ్రామీణ ప్రజలు చాలావరకు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారై కూలి నాలి చేసుకొని జీవనం సాగిస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు కావడంతో కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత రోజు వారి అవసరాలకు పోను, మిగిలింది పొదుపు చేసుకోవాలనే ఉద్దేశంతో సంపాదించిన దాంట్లో కొంచెం తమ పిల్లల భవిష్యత్ కోసం,కొంత మేర వృద్ధాప్యం లో ఆసరాగా ఉంటుందని వివిధ పథకాల్లో పెట్టుబడులు పెడుతూ పొదుపు చేస్తుంటారు. కొంతమంది కేటుగాళ్లు వారి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని వాటిని కాజేసి ఖాతాదారులను రోడ్డున పడేస్తున్నారు. ఇలాంటి ఘటనే గొల్లపల్లి మండలం లో జరగగా అది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పదిహేనేళ్లుగా గ్రామంలోనే నివాసం..

మండలంలోని చిల్వకోడూర్ గ్రామ బ్రాంచ్ లో పోచయ్య అనే వ్యక్తి పదిహేను సంవత్సరాలుగా తపాలా శాఖలో పోస్ట్ మాన్ గా విధులు నిర్వర్తిస్తూ అదే గ్రామంలో నివసిస్తూన్నాడు. చుట్టూ ప్రక్కల గ్రామాల్లో తపాలా పథకాలపై స్థానికులకు అవగాహన కల్పించేవారు. దీంతో చాలామంది తపాలా శాఖలో ఫిక్స్డ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలు డబ్బు పొదుపు చేస్తున్నారు. ప్రతి నెలా నిర్ణీత సమయంలో ఖాతాదారుల నుంచి డబ్బు వసూలు చేసి ఆ సొమ్మును ఖాతా బుక్ లో రాస్తున్న ఆన్లైన్ లో మాత్రం నమోదు చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన కొందరు గొల్లపల్లి బ్రాంచ్ లో విచారించగా గత కొన్ని నెలలుగా ఖాతాదారుల నుంచి తీసుకున్న సొమ్మును బ్రాంచ్ లో డిపాజిట్ చేయడం లేదని తెలవడంతో వారంతా అవాక్కయ్యారు. ఖాతాదారుల నుంచి తీసుకున్న సొమ్మును తన సొంత అవసరాలకు వాడుకున్నట్టు తెలిసింది.

మూడు నెలల కిందటే సస్పెండ్...

ఇదిలా ఉండగా సదరు పోస్ట్ మ్యాన్ ఇదివరకే ఇలాంటి వ్యవహారం చేయడంతో మూడు నెలల కిందటే సస్పెండ్ చేశారని పై అధికారులు చెబుతున్నారు. అయితే సస్పెండ్ అయిన విషయం గ్రామంలో ఎవరికి తెలియక పోవడం వల్ల ఖాతాదారులు ఎప్పటిలానే తమ సొమ్మును సదరు పోస్ట్ మ్యాన్ కు అప్పజెప్పారు. అయితే గత కొన్ని నెలలుగా ఖాతాదారుల సొమ్ము ను వాడుకుంటున్న పోస్ట్ మ్యాన్ వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక కూడదు అని పై అధికారులు తనిఖీ కోసం వస్తున్నారని చెప్పి ఖాతాదారుల నుంచి పాస్ బుక్స్ తీసుకుని ఉడాయించాడు.తాము మోసపోయామని గ్రహించిన ఖాతాదారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పాటు ఎలాగైనా తమ డబ్బు తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడులు పెడితే సురక్షితంగా కాదని ప్రభుత్వ సంస్థల్లో కష్టపడి సంపాదించిన డబ్బు తమ భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేస్తే ఆ మొత్తాన్ని తపాలా శాఖలోని ఉద్యోగి కాజేయడం తో ఏం చేయాలో తెలియక ఖాతాదారులు ఆందోళనతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

భూమి అమ్మిన పైసలు జమ చేసినం..: బాధితులు బొమ్మెన గంగవ్వ, రాజయ్య

మాకు పిల్లలు లేరు.వృద్ధాప్యం లో అక్కరకు వస్తాయని భూమి అమ్మిన పైసలు తొమ్మిది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. నెలకు రూ. ఐదు వేలు మిత్తి వస్తదని చెప్పిండు.దానికి సంబంధించిన ఎలాంటి బాండ్ మాకు ఇయ్యలేదు. ఇప్పుడు చూస్తే అసలు మా పేరు మీద ఆన్లైన్ లో డిపాజిట్ చేసినట్లే లేదు అంటున్నారు. ఉన్న సొమ్ము జమ చేస్తే ఇలా అయింది. మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం.


Similar News