మహిళలకు తపాలా శాఖ గుడ్ న్యూస్..
అన్ని వర్గాల ప్రజలకు వివిధ సేవలను విస్తృతం చేసిన తపాలశాఖ ఇటీవల పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో పాటుగా మహిళలకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, కరీంనగర్ టౌన్ : అన్ని వర్గాల ప్రజలకు వివిధ సేవలను విస్తృతం చేసిన తపాలశాఖ ఇటీవల పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో పాటుగా మహిళలకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రత్యేకంగా 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్-2023' పేరిట కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది. గత మార్చి 31నుంచి అమలులోకి వచ్చిన ఈ స్కీమ్ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ డివిజనల్ పోస్టల్ ఎస్పీ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కోరారు.
ఈ మేరకు గురువారం పోస్టల్ ఎస్పీ ఈ స్కీమ్ వివరాలతో ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాను మహిళలు ఓపెన్ చేసుకోవచ్చునని, వారి సంరక్షణలో మైనర్ బాలికలకు కూడా ఓపెన్ చేసుకోవచ్చునని తెలియజేసారు. ఈ స్కీంలో రూ.1,000 నుండి 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని, ఈ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ వస్తుందని వివరించారు. మరింత సమాచారం కోసం మీ దగ్గరలోని పోస్టాఫీసులలో సంప్రదించాలని సూచించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలకు పోస్టల్ పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఎస్పీ ప్రజలను కోరారు.