కలలో కూడా ఊహించలేదని సీఎం అనడం అస్సలు ఊహించలేదు: MLC Jeevan Reddy

సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తున్నాడని, తమ జిల్లాకు వరాల జల్లు కురిపిస్తాడని ఆశల పల్లకిలో ఊగిన ప్రజలకు...MLC Jeevan Reddy hits out at CM KCR

Update: 2022-12-08 11:32 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తున్నాడని, తమ జిల్లాకు వరాల జల్లు కురిపిస్తాడని ఆశల పల్లకిలో ఊగిన ప్రజలకు కేసీఆర్ ప్రసంగం పూర్తిగా నిరాశ కలిగించిందని. జిల్లా మీద కేసీఆర్ కు ఎందుకీ సవతి తల్లి ప్రేమ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. స్థానిక ఇందిరా భవన్ లో ఆయన మాట్లాడుతూ సీఎం సభలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సహకం లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది అని, ముత్యంపేట్ చక్కెర ఫ్యాక్టరీ పున ప్రారంభం మీద స్పష్టమైన హామీ ఇస్తారని భావించిన రైతులకు చేదునే మిగిల్చారు అని అన్నారు. మూడు జిల్లాల రైతులు లబ్ధి పొందేలా రూ. వెయ్యి కోట్లతో చక్కెర ఫ్యాక్టరీలు పున ప్రారంభం చేయవచ్చు అని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం పొందే అవకాశం ఉన్నా సీఎం మొండి పట్టుదలతో రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాడని, ఇకనైనా రైతుల సమస్యల పట్ల శ్రద్ద చూపాలని సూచించారు. ఒడ్డే లింగాపూర్ నూతన మండల ఏర్పాటు ప్రకటన స్వాగతిస్తున్నామని, అదే సమయంలో అన్ని అర్హతలు ఉన్న అల్లిపూర్ ను కూడా మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో జిల్లాగా ఏర్పాటు అర్హత ఉన్నవారిలో జగిత్యాల రెండో స్థానంలో ఉన్నది అని, అలాంటి జగిత్యాల జిల్లా అవడం కలలో కూడా ఊహించలేదు అని సీఎం అనడం అస్సలు ఊహించలేదని ఎద్దేవా చేశారు. భవిష్యత్ అవసరాల కోసం నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూమిని రక్షించనాని, అదే స్థలంలో నూతన కలెక్టరేట్ నిర్మాణం అవడంతో తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో సంతృప్తి ఇచ్చింది అని తెలిపారు. కొండగట్టు ఆలయానికి రూ. 100 కోట్లు కేటాయించడం బాగానే ఉందిగానీ, కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు నివాళులు అర్పించకపోవడం విచారకరం అని పేర్కొన్నారు.

2015లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ. 100 కోట్లు ఇస్తానన్న నిధులు ఇప్పటికీ ఇవ్వలేదు అని, యాదాద్రి తరహాలో ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. జిల్లా పార్టీ భవనాన్ని అయిదు నెలల్లో నిర్మించి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాత్రికేయులకు ఇండ్లు నిర్మించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రోళ్ళవాగు నిర్మాణంలో జాప్యం వల్ల ప్రాజెక్ట్ వ్యయం రూ. 60 కోట్ల నుండి 120 కోట్లకు చేరిందని, ఆ కట్ట తెగి అరగుండాల ప్రాజెక్ట్ తెగిపోయి పొలాల్లో ఇసుక మేటలు వేసిందని, దానివల్ల రైతులు వర్షాకాలం పంట నష్టపోయి రెండో పంట కూడా నష్టపోయే ప్రమాదం ఉందని, రోళ్ళ వాగు ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యంపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోవడంలో స్థానిక నాయకులు వైఫల్యం చెందారని, దాని పర్యవసానమే జిల్లాకు ఎలాంటి నిధుల మంజూరు లేదని దుయ్యబట్టారు.

Tags:    

Similar News