Minister Ponnam : లక్ష్య సాధనకు విద్యార్థులు అహర్నిశలు కృషి చేయాలి
తాము ఏర్పరుచుకున్న లక్ష్య సాధనకు విద్యార్థులు అహర్నిశలు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)కోరారు.
దిశ, తిమ్మాపూర్ : తాము ఏర్పరుచుకున్న లక్ష్య సాధనకు విద్యార్థులు అహర్నిశలు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)కోరారు. మంగళవారం రాత్రి తిమ్మాపూర్ మండల కేంద్రం లోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ (Sports meet)ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కంటే మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో అనేక విప్లవాత్మక మార్పులు తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని వెల్లడించారు. అనేక వసతులను తమ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. పోటీ ప్రపంచాన్ని తట్టుకుంటూ విద్యార్థులు దేశానికి, రాష్ట్రానికి విద్యలో మంచి పేరు తీసుకొచ్చేలా ముందుకెళ్లాలని సూచించారు.
రోజురోజుకు వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాబోయే రోజుల్లో బాగా చదువుకొని పాఠశాలలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రత్యేకమైన కేటగిరీల వారీగా ఎంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సీట్ సాధించి కోటి రూపాయల జీతం తీసుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జ్యోతిబా పూలే గురుకులాల్లో సోలార్ ప్యూరిఫైయర్ వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గురుకులాలకు సంబంధించిన రెంటు 50% యజమానులకు అందించినట్లు వెల్లడించారు. అన్ని వసతులు కల్పిస్తే మిగతా 50% చెల్లిస్తామని స్పష్టం చేశారు. అనంతరం పలు క్రీడాల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమం లో కలెక్టర్ పమేల సత్పతి, మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.