Minister Ponnam Prabhakar : ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరిస్తాం

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సమస్యలను తొందరలోనే

Update: 2024-09-09 13:52 GMT

దిశ, కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తామని బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో ప్రాథమిక అవసరాలను వెంటనే పరిష్కరించాలని, మాతా శిశు కేంద్రంలో మరో వంద పడకలు అందుబాటులోకి తేవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశం సోమవారం ఆసుపత్రి సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో డ్రైనేజీ సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఆస్పత్రిలో సుమారు 150 ఏసీలు, పరికరాలు అవసరం ఉన్నాయని సూపరింటెండెంట్ కోరగా ఏసీల ఏర్పాటు బాధ్యత తాను చూస్తానని మంత్రి తెలిపారు.

ఆస్పత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పాడైపోయిన అంబులెన్స్ ల స్థానంలో రెండు కొత్త అంబులెన్సులు కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలుకు కొన్ని నిధులు ఉన్నాయని ఇంకా రూ.9 లక్షలు అవసరమని సూపరింటెండెంట్ తెలుపగా ఆ నిధులు జిల్లా కలెక్టర్ సమకూర్చాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రిలో వచ్చే వారికి ఆర్ ఓ వాటర్ అందించాలని తెలిపారు.ఈసమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పేయి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పాల్గొన్నారు.


Similar News