అక్రమంగా యథేచ్ఛగా తరలిస్తున్న కలప..రహస్య ప్రాంతాల్లో డంప్

మండలం లో కలప అక్రమంగా తరలిస్తూ వ్యాపారస్తులు లక్షలు

Update: 2024-09-18 11:20 GMT

దిశ,ముస్తాబాద్: మండలం లో కలప అక్రమంగా తరలిస్తూ వ్యాపారస్తులు లక్షలు గడిస్తున్నారు.ప్రభుత్వ భూములల్లో, అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లను నరకడమే వీరి లక్ష్యం.ముస్తాబాద్ లో కొందరు కలప వ్యాపారుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. అనుమతుల పేరిట కలప వ్యాపారస్తులు చెట్లను పగలు నరికివేసి వాటిని ఓ రహస్య ప్రాంతంలో డంప్ చేస్తున్నారు.ఒకవేళ అనుమతులు ఉన్న కూడా వాటి పరిధిని మించి కలపను నరికి చేస్తుండటం గమనార్హం.ప్రభుత్వ భూముల్లో, అడవుల్లో సైతం గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరికివేస్తూ రహస్య ప్రాంతంలో డంప్ చేసి వాటిని ట్రాక్టర్ లలో రాత్రుల్లో అక్రమంగా చేరవల్సిన చోటుకి సురక్షితంగా చేరుతున్నాయి. అయితే ఈ అక్రమ తరలింపులో విలువైన టేకు కలప కూడా తరలి వెళ్తుండటం విశేషం.

మండలంలో యథేచ్ఛగా కలప, టేకు అక్రమ తరలింపు జరుగుతున్న కూడా అటవీ అధికారులు ఇప్పటివరకు మండలం లో తనిఖీలు చేసి టేకు కలపని పట్టుకున్న దాఖలాలు అయితే లేవు.తనిఖీలు చేపట్టకపోవడం పై అటవీ అధికారులపై అనుమానాలు మండలం లో తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. అక్రమ కలప తరలింపుల విషయం అటవీ అధికారులు లంచాలు తీసుకుని వీరి కనుసన్నల్లోనే అక్రమ తరలింపు జరుగుతుందనే విమర్శలు వచ్చిపడుతున్నాయి.

అటవీశాఖ అధికారులు మామూళ్లు వసూలు చేస్తు కలపను అక్రమంగా తరలించడం లో పాత్ర వహిస్తున్నారని వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. చేయి తడిపితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, లేనిపక్షంలో వేలకు వేలు అపరాధ రుసుం వేసి ట్రాక్టర్‌ను సీజ్‌ చేస్తామని అంటున్నారని వారు వాపోయారు. అటవీ అధికారులు నిర్లక్ష్యం వీడి మండలం లో నిల్వలు ఉన్న కలప డంప్ లపై తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అలాగే మండలం లో ఉన్న కట్టె కోత సామిల్ లలో కూడా భారీగా కలప నిల్వ ఉన్నట్లు వినికిడి.వీటిపై కూడా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది.


Similar News