పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి పొందాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించినట్టు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

Update: 2024-12-11 15:26 GMT

దిశ, జగిత్యాల టౌన్ : నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి పొందాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించినట్టు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో THREDZ IT గ్రూమింగ్ ఎక్సలెన్స్ వారి సహకారం తో జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిరుద్యోగ యువతకు నిర్వహించిన మెగా జాబ్‌మేళాను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువతీ, యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగాలు చేసుకొని కుటుంబానికి అండగా నిలబడాలని సూచించారు.

    చదువుకు పేదరికం అడ్డు రాదని, అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది వ్యక్తులు పేదరికాన్ని జయించిన వారే అన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత మిగతావన్నీ వాటంతట అవే మన దగ్గరకు వస్తాయని అభిప్రాయపడ్డారు. అలాగే ఎవరైనా డబ్బులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పితే నమ్మవద్దని తెలిపారు. నిరుద్యోగ యువత గల్ఫ్ దేశాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన, నమ్మదగిన ఏజెంట్ ద్వారా మాత్రమే వెళ్లాలని సూచించారు.

     కాగా ఈ మెగా జాబ్ మేళాలో 3200 మంది పాల్గొనగా 58 వివిధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్ లు వచ్చి యువతకు సంబంధించిన విద్యార్హతలను బట్టి ఇంటర్వ్యూ నిర్వహించగా 1107 మందికి నియామక పత్రాలు అందించారు. ఈ జాబ్ మేళాను విజయవంతం చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీ లు రఘుచందర్, సీఐ లు రాంనరసింహారెడ్డి, వేణుగోపాల్, రవి, కృష్ణారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్, రామకృష్ణ, వేణు, ఎస్ఐలు, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News