ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ప్రభుత్వం అందించే వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

Update: 2023-12-09 11:38 GMT

దిశ, గోదావరిఖని : ప్రభుత్వం అందించే వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రామగుండంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామగుండం పోలిస్ కమీషనర్ రెమా రాజేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రజల కోసం ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. చేయూత పథకం క్రింద రాజీవ్ ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద 1600 రకాల రోగాలకు 1300 ఎంపానల్మెంట్ ఉన్న ఆస్పత్రులలో చికిత్స అందిస్తామన్నారు.

ఈ రోజు నుండి 10 లక్షల వరకు నగదు రహిత చికిత్స ప్రజలకు అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ అన్నారు. మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఉచిత బస్సుప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మహిళలు, ట్రాన్స్ జెండర్ లు ఆర్టిసీలోని పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని, మహిళలు వారి దగ్గర ఉన్న ప్రభుత్వ గుర్తింపు కార్డు బస్సులను చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని అన్నారు. అనంతరం మహాలక్ష్మి, చేయూత పథకాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. మహాలక్ష్మీ పథకం క్రింద ఉచిత బస్సు ప్రయాణాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్, రామగుండం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్ , ఆర్టీసీ ప్రతినిధులు, ఆరోగ్యశ్రీ ప్రతినిధి సతీష్ కుమార్, వివిధ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News