అనర్హులకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాల కల్పన.. ప్రభుత్వ సొమ్ముతో పాలకుల సోకు
శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కరీంనగర్ కార్యాలయంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
దిశ, కరీంనగర్: శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కరీంనగర్ కార్యాలయంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పాలవకవర్గం సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానురీతిగా అనర్హులకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. దీనికి తోడు అధికారులు లేకపోవడం ఇన్చార్జి అధికారులు సరైన దృష్టి సారించకపోవడంతో వారు ఆడింది ఆట.. పాడిందే పాటగా కొనసాగుతోంది. నచ్చినవారికి ఔట్ సోర్సింగ్ పేరుతో ఉద్యోగమని చెప్పి ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా రూ.లక్షలు కాజేస్తున్న అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసిన శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో సెప్టెంబర్ 2023లో అప్పటి సూడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు తన వద్ద పని చేసే కుటుంబీకులలో గల ఐదుగురిని ఔట్ సోర్సింగ్ ద్వారా ఎలాంటి నియామాలు పాటించకుండా ఆక్రమంగా నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నియమాకాలకు సంబంధించి గత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఔట్ సోర్సింగ్ నియమ నిబంధనలు పాటించలేదు. సుడాలో డిప్యూటేషన్‌లో పని చేసిన పురుమల్ల సత్తయ్య ఏఈపీఆర్, డీఈఈ రాజేశం గత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే అప్పటి వైస్ చైర్మన్‌గా ఉన్న ఇప్పటి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రఫుల్ దేశాయి నోట్ పెట్టి నియమించారు. వీరు సుడా కార్యాలయంలో జరిగే అన్ని విషయాలు పాత వారికి చెరవేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా భావించి ఇప్పడున్న వైస్ చైర్మన్ తన తరుపున ఒక వ్యక్తిని, ఇంకో వ్యక్తిని ఒక శాశనసభ్యుడి సిఫార్సు ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు.
ప్రభుత్వ సొమ్ము పాలకుల సోకు..
ఐదుగురికి నెలకు ఒక్కొక్కరికి గత ఏడాది సెప్టెంబర్ నుంచి రూ.20వేల చొప్పున జీతం చెల్లించారు. డబ్బులకు ఎలాంటి ఆడిట్ లేదు. ఇప్పటి వరకు సుమారు రూ.7,25,000 విత్ డ్రా చేశారు. మరో ఇద్దరికి నెలకు రూ.25వేల చొప్పున సుడా జనరల్ ఫండ్ నుంచి జీతం ఇచ్చేందుకు ప్రతిపాదనలు తయారైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రతి నెల దాదాపు పాత ఐదుగురికి నెలకు రూ.లక్ష, కొత్తగా వచ్చిన ఇద్దరికి నెలకు రూ.50వేలు మొత్తం రూ.1,50,000ను నిబంధనలకు తూట్లు పొడిచి ప్రభుత్వ ధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నారు.
ఒకరిపై మరొకరు విమర్శలు..
తమ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు బయటకు పొక్కడంతో అధికారులపై పాలకులు, పాలకులపై అధికారులు పరస్పర విమర్శలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒత్తిళ్ల కారణంగానే పాలకులు చెప్పినట్టు చేశామని అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు అండగా ఉన్న వారిని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన వారిని శిక్షించాలని పలువురు కోరుతున్నారు.
అడ్మినిస్ట్రేషన్ అధికారే లేడు..
సుడా కార్యాలయంలో పూర్తిస్థాయి అడ్మినిస్ట్రేషన్ అధికారి లేకపోవడంతోనే అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. అధికారి లేకపోవడంతో ఇన్చార్జి బాధ్యతలు మరొక కార్యాలయానికి అప్పగించడంతో ఆ కార్యాలయంలో అధికారి పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించడం లేదు. దీంతో అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.