Bandi Sanjay : జన్వాడ ఫామ్ హౌస్ సంగతేంటీ రేవంతన్న
జన్వాడ ఫామ్ హౌస్ సంగతేంటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జన్వాడ ఫామ్ హౌస్ సంగతేంటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రశ్నించారు. గురువారం జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇటీవల మరణించిన బిజెపి మాజీ మండలాధ్యక్షుడు, కిసాన్ మోర్చా నాయకులు దేవేందర్ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించి, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కబ్జా చేసి అక్రమంగా నిర్మించుకున్న నిర్మాణాలను కూల్చే హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదంటూనే 6 గ్యారంటీలను మరిపించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా డ్రామా ఆడుతుందని దుయ్యబట్టారు.
స్వయంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో జైలుకు వెళ్లి వచ్చారని, ఇంకా జన్వాడ ఫామ్ ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ నిర్మాణాలపై హైడ్రా చర్యలు ఏవని, చెయ్యేస్తే మీ సంగతి చూస్తామని బెదిరిస్తే ప్రభుత్వం వెనకడుగు వేసిందని ఎద్దేవా చేశారు. పెద్ద పెద్ద వారిని వదిలి చిన్నవారిని ఇబ్బందులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఓనమాలతో, బిఆర్ఎస్ శిక్షణ పొంది నడుస్తుందని విమర్శించారు. నేడు రేపు అమెరికాలో యువరాజుకు అప్పగింతలు జరుగుతాయని జోష్యం చెప్పారు. గత ప్రభుత్వం లాగే స్కీములు పెడుతూ కోర్టుకు పంపుతున్నారన్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ చేస్తుందని, ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి, 6 గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సిరిసిల్ల నేత కార్మికుల బతుకులు ఆగమయ్యాయి
కరెంటు బిల్లుల విషయంలో సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వం మోసం జరిగిందని, ఎన్నికల ముందు రెండు పార్టీలు 50 శాతం కరెంటు బిల్లులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఇప్పటికే ఆ కరెంటు బిల్లులు తడిసి మోపెడై లక్షలకు చేరుకున్నాయన్నారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేత కార్మికుల సమస్యలను పట్టించుకునే బాధ్యత పాలకులపై ఉందని, అవసరమైతే ముఖ్యమంత్రి కి తాను లేఖ కూడా రాస్తానని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నేత కార్మికుల సమస్యలు తీర్చి, సంవత్సరం పొడుగునా ఉపాధి కల్పించి, వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.