రైతుబంధు ఇప్పిస్తానంటూ ఎకరం భూమి అక్రమ రిజిస్ట్రేషన్

రైతుబంధు వచ్చేలా చేస్తానంటూ సొంత నానమ్మను నమ్మించిన ఓ మనవడు మోసపూరితంగా రెండెకరాలు భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రామ్ సాగర్ గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2023-05-09 15:05 GMT

నానమ్మనే మోసం చేసిన మనవడు.. ఆర్డీవోకు ఫిర్యాదు

దిశ, జగిత్యాల ప్రతినిధి : రైతుబంధు వచ్చేలా చేస్తానంటూ సొంత నానమ్మను నమ్మించిన ఓ మనవడు మోసపూరితంగా ఎకరం భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రామ్ సాగర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామ్ సాగర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు నీలగిరి అమ్మాయి (75)ని మనవడు నీలగిరి రామేశ్వరరావు రైతుబంధు వచ్చేలా చేస్తానంటూ ఐదు నెలల క్రితం నమ్మించి ఆమె పేరుపై ఉన్న ఎకరం భూమిని కొడిమ్యాల ఎమ్మార్వో ఆఫీస్ లో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని వృద్ధురాలు ఆరోపించింది.

అయితే, రైతుబంధు వచ్చేలా.. చేస్తానంటేనే తాను ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లానని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడన్న విషయం తనకు తెలియదంటూ ఆ వృద్ధురాలు జగిత్యాల ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. కొడిమ్యాల ఎమ్మార్వో కూడా తనను రిజిస్ట్రేషన్ చేయడం ఇష్టమేనా.. అని అడగలేదని, ఒకవేళ అడిగి ఉంటే తాను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారనే విషయం తెలిసేదని ఆరోపించింది.

మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని తిరిగి తనకు ఇప్పించవలసిందిగా ఆర్డీవోకు వినతిపత్రం అందజేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన ఆర్డీవో మాదిరి కొడిమ్యాల ఎమ్మార్వోకు సదరు రిజిస్ట్రేషన్ ను హోల్డ్ లో ఉంచి అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడిన నీలగిరి రామేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోని సమగ్ర విచారణ జరపాలంటూ ఎమ్మార్వోకు ఆదేశాలు జారీ చేశారు.

అడిగే ఉంటాం.. సరిగ్గా గుర్తు లేదు : కొడిమ్యాల ఎమ్మార్వో స్వర్ణ

అక్రమ రిజిస్ట్రేషన్ విషయమై కొడిమ్యాల ఎమ్మార్వో స్వర్ణను వివరణ కోరగా.. రిజిస్ట్రేషన్ చేసేప్పుడు మనవడికి గిఫ్ట్ డీడ్ చేయడం ఇష్టమేనా అని అడిగే ఉంటాం. చాలా రోజులు అవుతోందని, తనకు సరిగ్గా గుర్తు లేదని తెలిపారు. విచారణ నిమిత్తం వృద్ధురాలి కుటుంబ సభ్యులను అందరిని కార్యాలయానికి రావాలని చెప్పినట్లు తెలిపారు. విచారణ అనంతరం ఈ విషయంలో పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

Tags:    

Similar News