పిచ్చుకల కిలకిలలు ఏవీ !

మానవాళికి మేలు చేసే పక్షుల్లో పిచ్చుకలది ప్రత్యేక స్థానం.

Update: 2025-03-20 03:34 GMT
పిచ్చుకల కిలకిలలు ఏవీ !
  • whatsapp icon

దిశ బ్యూరో, కరీంనగర్ : మానవాళికి మేలు చేసే పక్షుల్లో పిచ్చుకలది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు ఇంటి గుమ్మంలో ఇంటి పెరట్లో పంట పొలాల్లో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ.. సందడి చేసే పిచ్చుకలు కాల క్రమేణా కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు మానవ జీవితాల్లో మమేకమై గ్రామాలు, పట్టణాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ కనిపించి కనువిందు చేసే పిచ్చుకలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. పర్యావరణానికి మేలుచేసే పిచ్చుకలు మానవుడి జీవన వైవిధ్యంలో పెరుగుతున్న రసాయనిక ఎరువుల వాడకం వాతవరణంలో సంభవిస్తున్న పెనుమార్పులు పెరుగుతున్న రేడియోషన్ ప్రభావంతో ఊరపిచ్చుకలు తమ ఉనికిని కోల్పోతు కనుమరుగవుతున్నాయి . పర్యావరణానికి మేలు చేసే ఊరపిచ్చుకలు కనుమరుగవడం మానవజాతి మనుగడకు పెను ప్రమాదమని జీవ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న కాలుష్యంతో కనుమరుగవు..

మానవుడి జీవితంతో మమేకమైన ఊర పిచ్చుకలు కాలుష్యం కాటుకు నేలరాలుతున్నాయి. ఒకప్పుడు ఇళ్ల గుమ్మాలు ఇంటి పెరళ్లలోకి పదుల సంఖ్యలో వచ్చి కిచ కిచా రాగాలతో అలరింపజేసే పిచ్చుకల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా తగ్గిపోయింది. పిచ్చుకల రాగాలతో మనసు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండేది. పిచ్చుకల కితకితలు మనిషి ఒంటరి తనాన్ని సైతం మరిపించి ఆనందాన్ని ఇచ్చేవి ఒకప్పుడు వేసవి కాలం వచ్చిందంటే చాలు వాటి ఆకలి దప్పికలను తీర్చేందుకు ఇళ్ల గుమ్మాలకు వరి గింజలను కట్టి మట్టి చిప్పల్లో చల్లని నీరును పోసి వాటిని ఆహ్వానించేవారు. ఇప్పుడు పంటపోలాల్లో విచ్చలవిడిగా పురుగుమందుల వాడకం, చెట్ల నరికివేత ఇందన కాలుష్యం, వాహనాల రద్ధి, సెల్ ఫోన్ టవర్స్ వల్ల వచ్చే రేడియేషన్ తో తట్టుకోలేక పిట్టలు నేల రాలుతున్నాయి.

పిచ్చుకల మనుగడకు పెను ప్రమాదకరంగా మారిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం..

పిచ్చుకలు అంతరించిపోవడానికి నిపుణులు పక్షి ప్రేమికులు పలు కారణాలు వెల్లడిస్తున్నారు. నానాటికీ పెరిగిపోతున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వాటి మనుగుడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని సెల్ ఫోన్ టవర్ల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ తో పిచ్చుకలు ప్రాణాలొదులుతున్నాయంటున్నారు. రోజురోజుకు అంతరిస్తున్న పల్లె వాతావరణం, మాయమైన ఇంటి పెరళ్లు.. పెరిగిపోతున్న పట్టణీకరణ, నగరీకరణతో పిచ్చుకలు గూళ్లు పెట్టుకోవడానికి అవకాశం లేకపోవడం. వంట పొలాల్లో పురుగు నివారణకు వినియోగిస్తున్న విషపూరిత రసాయన మందులు సైతం పిచ్చుకల ప్రాణాలు హరిస్తున్నాయి అంటున్నారు.

మానవుడితో సమాన జీవన విధానం కలిగిన పిచ్చుకలు..

చిన్నగా.. బొద్దుగా ఉండే ఊర పిచ్చుకల కిచకిచల శబ్దాలే సపరేటు. గింజలు, చిన్నచిన్న కీటకాలే వీటికి ఆహారం. ఊర పిచ్చుక గూళ్లు చూడ్డానికి అందంగా, చూడముచ్చటగా ఉంటాయి. పిచ్చుక గూళ్లు మన ఇంజనీర్లను సైతం మై మరిపించే విధంగా ఉంటాయి. ఆడపిచ్చుకలు గుడ్లు పెట్టే ముందు మగ పిచ్చుకలు గడ్డి పొరలతో అందంగా గూళ్లు తయారు చేసుకుంటాయి. అవి ఎంతటి వర్షం వచ్చినా అందులోకి చినుకు దూరదు. గాలి దుమారాలు లేచి బీభత్సం సృష్టించిన చెక్కు చెదరని విధంగా ఉంటాయి. అంటే వాటి ప్రతిభ ఏపాటితో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వాటిలో వీటిలో ఆడపిచ్చుకలు గుడ్లు పెట్టి 11 నుంచి 14 రోజుల వరకు పొదిగి పిల్లలు చేస్తాయి. ఏడాదికి రెండుసార్లు పిచ్చుకలు పొదుగుతాయి. అయితే పిల్లల సంరక్షణ మగపిచ్చుకలు చూసుకుంటాయి. ఇప్పుడు భూతద్దం పెట్టి చూసిన పిచ్చుక గూళ్లు కానరావడం లేదు.


Similar News