తాగునీటి సమస్య పరిష్కారానికి సమగ్ర చర్యలు
వేసవిలో చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు.

దిశ, గంగాధర : వేసవిలో చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. ఆదివారం గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో ఎండాకాలంలో నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ సిబ్బంది సమన్వయంతో పని చేసి తాగునీటి ఎద్దడిని నివారించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాలలో అవసరం ఉన్నచోట కొత్త బోర్లు తవ్వడం, పైప్‌లైన్ మరమ్మతులు, గేట్ వాల్వ్‌ల బదిలీ, బోర్ల ఫ్లషింగ్ చేపట్టాలని, అందుకు నివేదిక సిద్ధం చెయ్యాలని అధికారులకు సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేసినా తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోయిందని మండిపడ్డారు. తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అంగీకారయోగ్యం కాదని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులను గుర్తించి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, అధికారులందరూ సమిష్టిగా పని చేయాలని సూచించారు. ఏ ఒక్క అధికారి అయినా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. సమావేశంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన ఎంపీడీఓలు, ఎంపీఓలు, మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.