అక్రమాల డొంకలు కదులుతున్నాయ్‌..!

చేతిలో అధికారం.. జీ హుజూర్ అంటూ అధికారుల దాసోహం వెరసి అడ్డూఅదుపులేకుండా ఎస్ఆర్ఎస్‌పీ అక్రమాలకు వేదికైంది.

Update: 2025-03-25 02:46 GMT
అక్రమాల డొంకలు కదులుతున్నాయ్‌..!
  • whatsapp icon

దిశ బ్యూరో, కరీంనగర్ : చేతిలో అధికారం.. జీ హుజూర్ అంటూ అధికారుల దాసోహం వెరసి అడ్డూఅదుపులేకుండా ఎస్ఆర్ఎస్‌పీ అక్రమాలకు వేదికైంది. ఖద్దరు నేతల కనుసన్నల్లో అధికారులు కాసులకు కక్కుర్తి పడి కమీనా వ్యవహారాలకు తెరలేపారు. ఖాళీ స్థలాలు కబ్జాలు చేసేందుకు ఇష్టానుసారంగా ఎన్‌వోసీలు జారీ చేశారు. దీంతో అధికారులు రూ.కోట్ల విలువైన భూములను అక్రమార్కులకు కట్టబెట్టారు. మట్టి కుప్పలు, కరకట్టలను కూడా వదలని అధికారులు చెరువులు, కుంటలను చెరబట్టారు. అధికారుల ధన దాహానికి ధ్వంసమైన చెరువులు, కుంటలు ఎన్ని?, అక్రమ ఎన్‌వోసీలతో అన్యాక్రాంతమైన భూమి ఎంత?, కాంట్రాక్టర్లు, ఖద్దరు నేతల చేతిలో ఖాళీ అయిన కరకట్టల విలువ ఎంత? అనేది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తికరంగా మారింది.

కాసుల కక్కుర్తితో భూములు అన్యక్రాంతం..

ఖద్దరు నేతలకు దాసోహం అన్నట్టుగా వ్యవహరించిన ఎస్ఆర్ఎస్‌పీ అధికారుల ధన దాహానికి రూ.కోట్ల విలువ చేసే ఎస్ఆర్ఎస్‌పీ భూములు అన్యక్రాంతమయ్యాయి. దారి తప్పిన నేతలు, అధికారుల దాష్టికానికి ఆక్రమణకు గురైన భూముల విలువ ఎంత? ఈ అక్రమాల్లో ఎవరెవరి హస్తం ఉంది?, అక్రమాలన్నింటికి సూత్రదారులు, పాత్రదారులు ఎవరు అనేది జిల్లా వ్యాప్తంగా సాగుతున్న చర్చ. ఎస్ఆర్ఎస్‌పీ భూములే టార్గెట్‌గా కొంతమంది నేతలు అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరలేపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అందుకు గతంలో పని చేసి రిటైర్డ్ అయిన ఎస్ఆర్ఎస్‌పీ ఎస్ఈ కేంద్రబిందువుగా అక్రమాలు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. కాగా, తాజాగా ఆ శాఖ రిటైర్డ్ ఎస్ఈపై కేసు నమోదు కావడం అందుకు బలం చేకూరుస్తుంది.

కదులుతున్న అక్రమాల డొంక...

అధికారం అడ్డు పెట్టుకుని కొంతమంది నేతలు వారికి దాసోహమంటు వంతపాడిన అధికారులు పదేళ్లుగా చేసిన అక్రమాలు ఇప్పుడు తీగలాగితే డోంక కదిలిన చందంగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం మారగానే తమ మెడకు చుట్టుకుంటాయని బావించిన అధికారులు తప్పించుకునేందుకు తంటాలు పడ్డారు. అయినా వెతకబోయిన తీగ కాలుకు తగిలినట్టుగా ఇప్పుడు అధికారులు చేసిన అక్రమ వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పదేళ్లలో పాలకుల దాష్టికానికి పర్యవసానంగా ఎస్ఆర్ఎస్‌పీ తన విలువైన భూములను అన్యాక్రాంతానికి గురి చేసుకోగా అక్రమాలకు పాల్పడి ఆక్రమించుకున్న దళారులు రూ.కోట్లకు పడగలెత్తారు. అధికారులను అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలే ఇప్పుడు వారి మెడకు చుట్టుకోనున్నాయి. అధికారులు జారీ చేసిన ఎన్ఓసీలతో పట్టా భూమిని సైతం వదలకుండా కబ్జా చేసేందుకు చేసిన ప్రయత్నం కబ్జాదారులను కటకటాల పాలు చేస్తున్నాయి. కాగా, అధికారులను సైతం దోషులుగా నిలబెట్టగా వారి బండారం బయటపడ్డట్లు అంతుచిక్కని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.

తప్పించుకునేందుకు దొంగ వ్యవహారం..

అక్రమాల నుంచి తప్పించుకునేందుకు అధికారులు పన్నిన పన్నాగం ఇప్పుడు వారికి గొడ్డలి పెట్టుగా మారిందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మారడంతో ఇక మా పనైపోతుంది ఎలాగైనా తప్పించుకోవాలని చేసిన ప్రయత్నం ఇప్పుడు వాస్తవ పరిస్థితిని వెలుగులోకి తేనుందనే చర్చ సాగుతుంది. అక్రమ ఎన్‌వోసీల వ్యవహరంతో అధికారుల బండారం బయటపడగా అధికారిక నిర్ధారణ కోసం పోలీస్ శాఖ ఎస్ఆర్ఎస్‌పీ శాఖకు లేఖ రాసింది. దీంతో వారి నుంచి అవి దొంగతనానికి గురయ్యాయంటూ సమాధానం రావడంతో.. లోతుగా పరిశీలించిన పోలీసులు తమదైన రీతిలో విచారణ చేపట్టగా ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నట్లు సమాచారం.

Similar News