ప్రతి క్షణం ప్రజల మధ్యే ఉంటా.. వారి సంక్షేమం కోసం కృషి చేస్తా: మంత్రి గంగుల కమలాకర్

ప్రతి క్షణం ప్రజల మధ్యే ఉంటా.. వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Update: 2023-04-12 14:13 GMT

దిశ, కరీంనగర్: ప్రతి క్షణం ప్రజల మధ్యే ఉంటా.. వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం అసీఫ్ నగర్ బావుపేటలో గ్రామాల్లో బుధవారం మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం గ్రామానికి వచ్చిన మంత్రి గంగులకు గ్రామస్థులు, తెరాస శ్రేణులు పూలవర్షం, భారీ గజ మాలతో సత్కరించి స్వాగతం పలికారు.

ఆనంతరం రూ.4.87కోట్ల సీడీపీ నిధులతో తమిళ కాలనీ నుంచి శ్వేత కాంప్లెక్స్ వరకు నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆసీఫ్ నగర్ చింత చెట్టు వద్ద ఉన్న అంగడి బజారుకు చేరుకుని రూ.20లక్షలతో నూతనంగా నిర్మించనున్న షెడ్డు, రూ.20 లక్షల సీడీసీ నిధులతో నూతనంగా నిర్మించనున్న గౌడ, ముదిరాజ్, నాయి బ్రాహ్మణ కుల సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు.

అక్కడి నుంచి బయలుదేరి రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయితీ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.6.26 కోట్లతో ఎస్సీ కాలనీ నుంచి బావు చెరువు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.5 లక్షల సీడీపీ నిధులతో ఎస్సీ కాలనీ లో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి సభలో మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు 2009 లో నన్ను కడుపులో పెట్టుకుని గెలిపించి అసెంబ్లీకి పంపించారని అన్నారు.

కరీంనగర్ చరిత్రలో ఎన్నడు లేని విధంగా హ్యాట్రిక్ విజయాలను తనకు కట్టబెట్టినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి రావడానిక కారణం నియోజకవర్గ ప్రజలేనని అన్నారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.. సమైక్య పాలనలో రోడ్లు అధ్వాన్నంగా ఉండేవన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్లను పునర్మిస్తున్నామని తెలిపారు.

మిషన్ భగీరథతో తాగునీటి ఇబ్బందులు కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి ఇబ్బందులు తీర్చిన ఘటన కేవలం సీఎం కేసీఆర్ కే చెల్లుతుందన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో పచ్చన ఉన్న తెలంగాణలో ఓర్వ లేక ప్రతిపక్షాలు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. పాదయాత్రలు చేపడుతున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు ఇక్కడ దోచుకున్నది సరిపోక పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు. వైస్ షర్మిల ఇక్కడ ఎందుకు పాదయాత్ర చేస్తుందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనీల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్, కరీంనగర్ ఏఎంసీ చైర్మెన్ రెడ్డవేని మధు, సర్పంచ్ కడారి శాంత - శ్రీనివాస్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సాబీర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News