రైతులకు గన్నీ సంచుల పరేషాన్.. చిరిగిన సంచులతో చిరాకు..
మండల పరిధిలో ఉన్న సహకార సంఘాలలో చిరిగిన గన్నీ సంచులతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
దిశ, శంకరపట్నం : మండల పరిధిలో ఉన్న సహకార సంఘాలలో చిరిగిన గన్నీ సంచులతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మెట్టుపల్లి సహకార సంఘం పరిధిలోని మొలంగూరు గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో పాత సంచులతో ధాన్యం తూకం వేసి ఓ రైస్ మిల్లుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మొలంగూరు వద్ద ప్రధాన రహదారి పైనే సంచులలో నుండి ధాన్యం జారిపోయి ట్రాక్టర్లో ఉన్న బస్తాలు కూలిపోయాయి. దీనితో ధాన్యం బస్తాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. చిరిగిన గన్ని సంచులతో ఇబ్బంది పడుతున్నట్లు రైతులు తెలిపారు. అంతేకాకుండా పాత సంచులకు తాడు బిగించే సందర్భంలో చిరిగిపోతాయని ఉద్దేశ్యంతో పైపైనే కట్టడంతో కూడా బస్తాలు కూలిపోతున్నాయన్నారు.
ట్రాక్టర్ డ్రైవర్ ఐకేపీ నిర్వాహకులకు సమాచారం అందించగా కూలిపోయిన బస్తాలను, ధాన్యాన్ని మరి కొన్ని సంచుల్లో నింపి పంపించారు. అన్ని సహకార సంఘాలలో సరిపడా గన్ని సంచులు కొత్తవే ఉన్నట్లు సమాచారం. అయినా పాత సంచులను ఇవ్వడం ఏంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని సింగిల్ విండో చైర్మన్ ప్రొద్దుటూరు సంజీవరెడ్డిని వివరణ కోరగా గన్ని సంచులకు సహకార సంఘానికి సంబంధం లేదని సివిల్ సప్లై అధికారులు ఇచ్చే సంచుల్లోనే కాంటాలు వేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కొత్త , పాత గన్ని సంచులు కలిపి వాడుతున్నామన్నారు.