పల్లెల్లో గుప్పుమంటోన్న గుడుంబా.. జోరుగా పాత బెల్లం కొనుగోళ్లు

గ్రామాల్లో గుడుంబా గుప్పుమంటోంది.

Update: 2024-10-03 02:40 GMT

దిశ, శంకరపట్నం: గ్రామాల్లో గుడుంబా గుప్పుమంటోంది. ప్రభుత్వం పాత బెల్లం అమ్మకాలపై ఆంక్షలు విధించినప్పటికీ తయారుదారులు బెల్లం సమకూర్చుకునేందుకు వాడవాడలా చక్కర్లు కొడుతున్నారు. అలా సేకరించిన బెల్లంతో రహస్య ప్రదేశాల్లో బట్టీలు ఏర్పాటు చేసి గుడుంబా తయారు చేసి ప్యాకెట్లలో విక్రయిస్తున్నారు. దీంతో పల్లెల్లో గుండుంబా విక్రయాలు ఊపందుకున్నాయి. నాటు సారా తయారీకి ఒకేసారి బెల్లం కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని కొందరు. తెలివిగా కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ.. పాత బెల్లం సేకరిస్తున్నారు. శంకరపట్నం మండల పరిధిలోని పలు గ్రామాల్లో తిమ్మాపూర్ మండలానికి చెందిన గుడుంబా తయారీదారులు మండలానికి చెందిన తయారీదారులు యథేచ్ఛగా పాత బెల్లం కొనుగోలు చేస్తున్నారు.

అదేవిధంగా సమ్మక్క, సారక్కలకు మొక్కుబడులు చెల్లించిన తరువాత ఇండ్లలో ఉన్న పాత బెల్లాన్ని కేజీ రూ.5 నంచి రూ.10 విక్రయిస్తున్నారు. తెల్లవారుజామునే గ్రామాల్లో స్రీ, పురుషులు కలిసి తిరుగుతూ పాత బెల్లం సేకరిస్తున్నారు. అలా సేకరించిన బెల్లాన్ని ఓ గ్రామంలో రహస్య ప్రాంతంలో నిల్వ చేసి పగటి పూట కాకుండా రాత్రి వేళలు, తెల్లవారుజాములు బట్టీలు ఉన్న ప్రాంతానికి తరలించి నాటుసారాను తయారు చేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతుంటే దానికి తోడు కుళ్లిన పండ్లు, పాత బెల్లం, కొన్ని రకాలైన రసాయనాలను కలిపి యథేచ్ఛగా గుడుంబా తయారు చేసి విక్రయిస్తున్నారు. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిన ఉందంతాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా నాటుసారా ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతుండటంతో కొందరు మంచానికే పరిమతయ్యే పరిస్థితి నెలకొంది. అడపాదడపా.. ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నా తీరు మార్చుకోని నాటుసారా తయారీదారులు అడ్డదారుల్లో అధికారుల కళ్లుగప్పి నాటుసారాను విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు గుడుంబా తయారీపై స్థవరాలపై నిఘా పెట్టి ఆకస్మిక దాడులు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Similar News