దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధిః బోయినపల్లి నుంచి వేములవాడ రోడ్డులో గల గంజి వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంజి వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు ఎక్కడి దాకా పూర్తి అయ్యాయో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వంతెన నుంచి నేరుగా బోయినపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాల భవనంలో తరగతి గదులు, టాయిలెట్స్ తదితర పనులు పరిశీలించి, కావాల్సిన మరమ్మత్తులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని డీఈఓ రమేష్ కుమార్ ను ఆదేశించారు. కొత్త బిల్డింగ్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రక్త పరీక్షల గది, ఫార్మసీ గది, లేబర్ రూంను పరిశీలించారు. అనంతరం ఓపీ రిజిస్టర్ తనిఖీ చేసి, ఎంత మంది రోగులు వచ్చారో, ఎందరికి రక్త పరీక్షలు చేశారని డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఉదయం రోగులకు ఒకరికి రక్త పరీక్ష చేసినట్లు కలెక్టర్ దృష్టికి డాక్టర్ తీసుకెళ్లారు. మందులు, టెస్ట్ కిట్లు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సీఈఓ వినోద్, ఎంపీడీఓ జయశీల, వైద్యాధికారి రేణుక తదితరులు పాల్గొన్నారు.