ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల ఇన్ చార్జి డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి : జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల ఇన్ చార్జి డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. శుక్రవారం ఉదయం మంచినీళ్ల బావి వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పట్టణ పోలీసులను చూసి ఓకే బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు.
పట్టుకున్న ముగ్గురు వ్యక్తులకు గతంలో నేర చరిత్ర ఉండడంతో విచారణ జరపగా నిందితులైన జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లికి చెందిన నాగరాజు, టీఆర్ నగర్ కు చెందిన అక్తర్, మల్యాల మండలం నూకపల్లి కు చెందిన ఖాలిద్ లు వేములవాడ, జగిత్యాల, ధర్మపురి ప్రాంతాల్లో వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.2.55 లక్షలు విలువ చేసే ఒక ఆటో, ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దొంగతనాలన్నీ కేవలం 15 రోజుల వ్యవధిలో జరిగినట్లు నిర్ధారించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పట్టణ సీఐ రామచందర్ రావు, ఎస్సై రహీమ్, సంజీవ్, మల్యాల ఎస్సై చిరంజీవి ఇతర పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.