బిట్ కాయిన్ స్కీం పేరిట భారీ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు
ప్రజల ఆశలే పెట్టుబడిగా చేసుకుని మోసాలకు తెర తీస్తున్నారు.
దిశ, కర్నూలు ప్రతినిధి : ప్రజల ఆశలే పెట్టుబడిగా చేసుకుని మోసాలకు తెర తీస్తున్నారు. స్కీముల పేరిట రెట్టింపు నగదు ఇస్తామని వల వేస్తున్నారు. వీరిలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకుంటుంటే.. గ్రామాలకు చెందిన అమాయక ప్రజలతోపాటు పట్టణ, జిల్లా కేంద్రానికి చెందిన అనేక మంది మోసపోతున్నారు. బిట్ కాయిన్స్ పేరిట జిల్లాలో దాదాపు 130 ప్రాంతాలకుపైగా రూ.60 లక్షలు వసూలు చేశారు. తీరా కాల గడువు ముగియడంతో నిర్వాహకులు, మధ్యవర్తులు ముఖం చాటేయడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
మాయమాటలే పెట్టుబడి
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజక వర్గాలు, 57 మండలాలు, 921 రెవెన్యూ గ్రామాలు, 993 పంచాయతీలున్నాయి. నాలుగు నెలల క్రితం ఉమ్మడి జిల్లాలో హైదరాబాద్, కలకత్తా, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు చెందిన వ్యక్తులు బిట్ కాయిన్ గురించి చెప్పి వారి ద్వారా ఎలాంటి అనుమానం రాకుండా రూ.500 చొప్పున కట్టించుకున్నారు. ఇంకా పరిచయం ఉన్న వారితో కట్టించుకుంటే రోజుకు రూ.200 చొప్పున 90 రోజుల తర్వాత ఓ పెద్ద సంస్థ ఇస్తుందని నమ్మబలికారు. ఇలా చాలా మంది మహిళలతోపాటు నిరక్షరాస్యులైన పురుషులతో రూ.500 చొప్పున కట్టించుకున్నారు. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 130 ప్రాంతాలకు చెందిన వారి నుంచి దాదాపు రూ.60 లక్షలకుపైగా వసూలు చేశారు. ప్రతి ప్రాంతంలో 80 నుంచి 120 మంది వరకు ఈ బిట్ కాయిన్ స్కీంలో సభ్యులుగా చేరారు. ప్రతి రోజూ సాయంత్రం వేళలో సెల్ కు కాయిన్స్ పడినట్లు మెసెజ్ లు రావడంతో సంబరపడ్డారు. తమ కాల వ్యవధి ముగిస్తుందని, తమకు ఒక్కొక్కరికి రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు డబ్బులు వస్తాయని ఆశతో ఎదురు చూశారు.
కాల వ్యవధి ముగింపుతో బయటపడ్డ బాగోతం
ప్రతి సభ్యుడు రూ.500తో బిట్ కాయిన్ లో సభ్యులుగా చేరిన వారికి 90 రోజుల వరకు కాల వ్యవధి ఉంటుందని నమ్మబలికారు. అయితే 90 రోజుల కాల గడువు ముగిసింది.బతమకు త్వరలోనే డబ్బులు వేస్తారని భావించిన బాధితులకు నిరాశ ఎదురైంది. గడువు ముగిసి ప్రస్తుతం నెల రోజులు దాటింది. అనుమానం వచ్చిన బాధితులు స్కీంలో రావాల్సిన డబ్బుల కోసం మధ్యవర్తులకు ఫోన్లు చేశారు. పథకం ప్రకారం మోసం చేసిన నిర్వాహకులు, మధ్యవర్తులు అసలు విషయం చెప్పకుండా డిసెంబర్ వరకు ఆగాలని, అప్పుడు రెట్టింపు వస్తాయని చెబుతున్నారు. మాయమాటలు చెప్పి స్కీం పేరుతో మోసం చేశారని వాపోతున్నారు.