అక్క స్థానంలో సోదరుడు.. సీఎంవోకు ఫిర్యాదు చేసిన మంత్రులు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది..
దిశ, వెబ్ డెస్క్: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ(Allagadda MLA Bhuma Akhilapriya) సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి(Bhuma Vikhyat Reddy) తీరు వివాదాస్పదంగా మారింది. ఆయనకు అధికారికంగా ఏ హోదా లేకపోయినా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. అధికారులను ప్రశ్నించారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. భూమా విఖ్యాత్ రెడ్డి ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత, భూమా అఖిల ప్రియ సోదరుడు మాత్రమే.. కానీ అధికారికంగా ఆయనకు ఎలాంటి అధికార పదవి లేదు. కానీ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో తన సోదరి భూమా అఖిల ప్రియ స్థానంలో పాల్గొన్నారు. దీంతో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, ఫరూక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార హోదా లేకున్నా సమావేశానికి విఖ్యాత్ రెడ్డి పాల్గొనడాన్ని తప్పు బట్టారు. సీఎంవోకు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.
కాగా నంద్యాల కలెక్టరేట్(Nandyal Collectorate)లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్(Ministers BC Janardhan Reddy, Mohammed Farooq), ఎమ్మెల్యేలు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి(Kotla Surya Prakash Reddy), గౌరు చరితతో పాటు కలెక్టర్ రాజకుమారి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో పాటు టీడీపీ నేత విఖ్యాత్ రెడ్డి(TDP leader Vikhyat Reddy) పాల్గొన్నారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వేదికపై కూర్చుని అధికారులను ప్రశ్నించారు. దీంతో విఖ్యాత్ రెడ్డి తీరుపై మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, ఫరూఖ్ తప్పుబట్టారు. ఎమ్మెల్యే సోదరుడు అయిన మాత్రాన అధికారులతో సమీక్షా సమావేశానికి ఎలా హాజరవుతారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధి మాదిరిగా అధికారులను నిలదీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ హోదాలో విఖ్యాత్ రెడ్డి ఈ సమావేశానికి వచ్చారని అటు అధికారులపైనా ధ్వజమెత్తారు. అయితే విఖ్యాత్ రెడ్డిని తామేమీ ఆహ్వానించలేదని మంత్రులకు వివరించారు. దీంతో విఖ్యాత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించకపోవడంపై సీరియస్ అయ్యారు. సీఎంవోకు ఫిర్యాదు చేశారు.