ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. కృష్ణా నదిలో పడి యువకుడి మృతి

సరదాతో పాటు జలాదివాసం వీడుతున్న సంగమేశ్వరుడిని సెల్ఫీ తీయబోయిన యువకుడు మృతి చెందగా, మరొకరు బతికి బయట పడ్డాడు.

Update: 2025-03-19 11:21 GMT
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. కృష్ణా నదిలో పడి యువకుడి మృతి
  • whatsapp icon

దిశ ప్రతినిధి, కర్నూలు : సరదాతో పాటు జలాదివాసం వీడుతున్న సంగమేశ్వరుడిని సెల్ఫీ తీయబోయిన యువకుడు మృతి చెందగా, మరొకరు బతికి బయట పడ్డాడు.. ఈ ఘటన మండలంలోని సప్తనదుల సంగమేశ్వరం వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామానికి చెందిన మద్దిలేటి కుమారుడు సందీప్(23) డిగ్రీ డిస్ కంటిన్యూ చేశాడు. ప్రస్తుతం వేసవి కావడంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

ఈ క్రమంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సప్త నదులు కలిసే సంగమ క్షేత్రమైన సంగమేశ్వరం ఆలయం క్రమంగా జలాదివాసం వీడుతోంది. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు ఏపీ, తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. అందులో భాగంగానే మండ్లెం గ్రామానికి చెందిన మృతుడు తన స్నేహితుడితో కలిసి వచ్చాడు. నదిలో ఉండే దేవాలయం పడేలా మొదట సెల్ఫీ తీసుకున్నారు. రెండ్రోజులుగా ఆలయ పురోహితులు నీటిలో నడవడం.. నీటిలోనే గుడిలోకి వెళ్లడం వంటి ఫొటోలు చూసిన యువకులు వారు కూడా నీటిలో నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆలయానికి సమీపంలో లోతు ఎక్కువగా ఉందని, అక్కడికి వెళ్లవద్దని స్థానికులు వారించినా వినలేదు.

నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో సందీప్ అనే యువకుడు లోతైన గుంతలో పడి మునిగిపోయాడు. వెంట ఉన్న మరో యువకుడు కేకలు వేయడంతో స్థానికులు పుట్టీల ద్వారా వచ్చి గాలించి నదిలో గల్లంతైన యువకుడిని బయటకు తీశారు. అయితే ఆ యువకుడు అప్పటికే మరణించడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి భోరున విలపించారు. స్థానికుల సమాచారం మేరకు కొత్తపల్లి తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Similar News