Former MP Vinod Kumar : బండి సంజయ్ తిట్ల పురాణం మానుకో..
కేంద్ర మంత్రి బండి సంజయ్ తిట్ల పురాణం మానుకొని,
దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కేంద్ర మంత్రి బండి సంజయ్ తిట్ల పురాణం మానుకొని, రాష్ట్ర జాతీయ రహదారులపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రహదారుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నష్టం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో తాను ఎంపీగా ఉండి, ఎన్నో జాతీయ రహదారులకు ప్రతిపాదనలు చేశామని గుర్తు చేశారు.
దుద్దెడ, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ వరకు ఉన్న చివరి దశలో 365 బి జాతీయ రహదారిని, కోరుట్ల వరకు పొడిగించేలా కేంద్రమంత్రి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. దాంతో రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేసే విధంగా రహదారి నిర్మాణం జరుగుతుందని, భవిష్యత్ తరాలకు ప్రమాద రహిత రహదారులను అందించిన వారమౌవుతామన్నారు. అలాగే సిరిసిల్ల మున్సిపాలిటీకి రహదారిని తాకకుండా పక్కనుంచి వెళ్లేలా చెయ్యాలన్నారు. సిరిసిల్లలోని మానేరు డ్యాం పై 1.8 కిలోమీటర్ల వంతెనకు గత ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు పంపామని, దాని నిర్మాణ పనులు ఆరంభ దశలోనే ఉన్న క్రమంలో మానేరు డ్యాం పై రాజమండ్రి వంతెన మాదిరి రైలు కం రోడ్డు వంతెన నిర్మాణం చేయడానికి కేంద్ర మంత్రి కృషి చేయాలన్నారు.
దీంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గా ఉన్న వేములవాడ మంచి టూరిజం స్పాట్(Tourism spot) గా మారుతుందన్నారు. వీటి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం అదనంగా డబ్బులు చెల్లించాలని ఆయన డిమాండ్(demand) చేశారు. లేనిపక్షంలో నిర్వాసితులను కదిలించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంట్ (Parliament) నియోజకవర్గం ఇంచార్జి తుల ఉమా, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కళ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యా, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.