భోజన ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బట్టబయలు!

జగిత్యాల జిల్లాలో కల్తీ మాఫియా వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది.

Update: 2024-07-08 03:27 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలో కల్తీ మాఫియా వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. కుళ్ళిన మాంసం, కాలం చెల్లిన నిలువ ఉంచిన పదార్థాలతో ఫుడ్ తయారు చేస్తూ కల్తీ దందాకు తెరలేపాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు ప్రజా అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఆహార కల్తీకి పాల్పడుతున్నారు. గత కొద్ది రోజులుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేస్తున్నప్పటికి పరిస్థితిలో మార్పు రావడం లేదు. అధికారుల తనిఖీల నేపథ్యంలో బయట ఫుడ్ తినాలంటేనే భోజన ప్రియులు జంకుతున్నారు.ఈ కల్తీకి పాల్పడుతున్న వాటిలో పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తుంది.

దారుణంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహణ

జగిత్యాల పట్టణంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ముఖ్యంగా కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉన్న కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. నాళాల పక్కనే ఏర్పాటు చేసిన కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడే చికెన్ రోజుల తరబడి నిల్వచేసి వాసన రాకుండా వెనిగర్ తో పాటు ఇతర రసాయనాలు కలుపుతారనేది బహిరంగ రహస్యమే. మరోవైపు అత్యంత భయంకరమైన నిషేధిత ఆరెంజ్ ఫుడ్ కలర్స్ తో పాటు ఏమాత్రం నాణ్యతలేని సాస్ లను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మరిగించిన వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు సమాచారం.

నిబంధనలు ఎక్కడ..!

కొన్ని హోటళ్లు రెస్టారెంట్ యాజమాన్యాలు నాణ్యత విషయంలో రాజీ పడుతూ నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదు. కేవలం డైనింగ్ ఏరియా మినహా కిచెన్, స్టోర్ రూమ్, వాషింగ్ ఏరియాల్లో పరిశుభ్రతను గాలికి వదిలేసారు. మిగిలి పోయిన వంట పదార్థాలను ఏ రోజువి ఆ రోజే పడేయాల్సి ఉండగా రిఫ్రిజరేటర్ లలో నిలువ ఉంచి మరుసటి రోజు వినియోగిస్తున్నారు. ఫ్రెష్ నాన్ వెజ్ మాత్రమే వాడాలనే నిబంధనలు ఉన్నప్పటికీ మాంసం విక్రయాలు చేసే వారితో బేరం కుదుర్చుకుని నిల్వ ఉంచిన మాంసాన్ని తక్కు వ ధరకు తీసుకువచ్చి వంటకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి మాత్రమే కాకుండా వంట నూనెలు, మైదా, సాస్ ల విషయంలోనూ నాణ్యత పాటించడం లేదు.

నాణ్యత పాటించకుంటే చర్యలు తప్పవు..

అనూష, ఫుడ్ ఇన్స్పెక్టర్

రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. నాణ్యత కలిగిన పదార్థాలను మాత్రమే వంటలలో వినియోగించాలి. కిచెన్, స్టోర్ రూమ్ లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్ నిల్వ ఉంచకుండా ఫ్రెష్ మీట్ ఏ రోజుది ఆ రోజే వినియోగించాలి. నిషేధిత రసాయనాలు, ఫుడ్ కలర్స్ వాడితే చర్యలు తీసుకుంటాం.

ఆహార కల్తీ కి పాల్పడితే లైసెన్స్ రద్దు చేయాలి..

కొండ అనిల్ గౌడ్, జగిత్యాల

ఫుడ్ కల్తీ కి పాల్పడే హోటల్స్,రెస్టారెంట్లపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. కుళ్ళిన మాంసం నిలువ ఉంచిన నాన్ వెజ్ ఐటమ్స్ సప్లై చేస్తున్న రెస్టారెంట్ల లైసెన్సులతో పాటు అనుమతులను రద్దు చేయాలి. పట్టణంలో పర్మిషన్లు లేకుండా నిర్వహిస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తొలగించేలా చర్యలు చేపట్టాలి.


Similar News