త్వరలోనే మిగిలిన రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం : ధర్మపురి ఎమ్మెల్యే

అర్హులైన రైతులు అందరికి రుణ మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం

Update: 2024-10-05 13:06 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : అర్హులైన రైతులు అందరికి రుణ మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విప్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 65 వేలకు పైగా రైతులకు రుణ మాఫీ అయిందని అన్నారు. మరో 4 వేలకు పైగా ఉన్న రైతులకు కూడా రుణ మాఫీ అవుతుందని హామీ ఇచ్చారు.బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి రైతులు గందరగోళానికి గురి కావద్దని సూచించారు. అసలు పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.

రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయడం జరిగిందన్నారు.కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఎంత మంది రైతులకు రుణ మాఫీ చేసిందో,వరదల వల్ల నష్టపోయిన ఎంత మంది రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారో ధర్నాలు చేసిన నాయకులు గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు.సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ అబద్దాలను నిజాలుగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. భవిష్యత్తులో రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తామని అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.


Similar News