కొండెక్కిన కూరగాయల ధరలు.. సామాన్యులు బెంబేలు

అకాల వర్షాల కారణంగా మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటుంటున్నాయి.

Update: 2024-10-05 03:26 GMT

దిశ, గోదావరి ఖని: అకాల వర్షాల కారణంగా మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటుంటున్నాయి.దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై చెప్పుకోలేని భారం పడుతోంది. కనీసం ఉన్నంతలో కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరగడంతో పూట గడవని స్థితిలో వెజిటెబుల్స్ ధరలను చూసి అవాక్కవుతన్నారు. ఇక చేసేదేమి లేక మార్కెట్‌కు వెళ్లిన వినియోగదారులు తక్కువ మోతాదులో కూరగాయలు కొనుగోలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

సామాన్యులు కొనలేని పరిస్థితి.

వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా కూరగాయల దిగుబడి పూర్తిగా పడిపోయింద. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. మామూలు రోజుల్లో మార్కెట్‌కు వెళ్లిన వారు కిలోల చొప్పున చేసేవారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు అర, పావు కిలోల చొప్పున కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి ధరలు కూడా పెరిగాయి. ధరలు పెరగడంతో ఎవరూ కూరగాయలు కొనేందుకు రావడం లేదంటూ వ్యాపారాలు గగ్గోలు పెడుతున్నారు.

మార్కెట్లో కూరగాయల రేట్లు కిలో చొప్పున ఇలా..

టమాట రూ.100, బీరకాయ రూ.120, కాకరకాయ రూ.100, వంకాయ రూ.60 చిక్కుడుకాయ రూ.120, ములక్కాయ రూ.200, బెండకాయ రూ.60, దొండకాయ రూ.60, సొరకాయ రూ.50, రూ.క్యారెట్ రూ.60, బీట్‌రూట్ రూ.60, పచ్చిమిర్చి రూ.60, కోత్తిమీర రూ.200, పాలకూర రూ.100, తోటకూర రూ.100, వాటితో పాటు అల్లం రూ.100, ఉల్లిపాయలు రూ.200, ఉల్లిగడ్డ రూ.60, కోడి గుడ్లు డజన్ రూ.80గా ధరలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా కూరగాయల ధరలు పెరుగుతూ పోతే పేద, మధ్య తరగతి కుటుంబాలు బతకడం కష్టమేనని పలువురు అంటున్నారు. నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలు తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని సామాన్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


Similar News