యథేచ్ఛగా పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ దందా

శ్రీరామా రైస్ మిల్‌కు దాదాపు 9146 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. 6127 క్వింటాళ్ల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 1160 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారని ఇంకా 4960 క్వింటాళ్ల బియ్యం ఇవ్వాల్సి ఉందన్నారు.

Update: 2024-10-05 02:57 GMT

దిశ, శంకరపట్నం: శంకరపట్నం మండలం అంబాలపూర్ గ్రామంలో గల శ్రీరామా రైస్ మిల్ పై సివిల్‌ సప్లై అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరామా రైస్ మిల్‌కు దాదాపు 9146 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. 6127 క్వింటాళ్ల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 1160 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారని, ఇంకా 4960 క్వింటాళ్ల బియ్యం ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యాన్ని సదరు రైస్ మిల్లు యజమాని అప్పనంగా అమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. అట్టి ధాన్యం విలువ దాదాపుగా కోటి యాబై లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మిల్లులోని బియ్యం శాంపుల్స్ సేకరించి పీడీఎస్ బియ్యమా?? కాదా ?? నిజనిర్ధారణ కోసం పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ పీడీఎస్ బియ్యం అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైస్ మిల్లుకు కేటాయించిన ప్రభుత్వ ధాన్యం పూర్తిగా లేకపోవడంతో అట్టి విషయాన్ని అధికారులు జాయింట్ కలెక్టర్ కు తుది నివేదిక ద్వారా తెలియజేస్తామన్నారు. ఈ ఒక్క రైస్ మిల్లే కాదు చాలా వరకు రైస్ మిల్లులో ఇదే తతంగం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సివిల్ సప్లై అధికారులు ఎప్పటికప్పుడు రైస్ మిల్లులను తనిఖీలు చేస్తే వాస్తవ పరిస్థితులు బయటపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ తనిఖీలలో ఏఎస్ఓ బుచ్చిబాబు, సివిల్ సప్లై డిటి ఖాజా మోహినొద్దీన్,ఫుడ్ ఇన్స్పెక్టర్ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి

ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి మండలంలో ఉన్న పలు రైసు మిల్లర్లకు కేటాయించింది. ప్రభుత్వమే రైతులకు డబ్బులు కూడా చెల్లిస్తుంది. పిదప అట్టి ధాన్యాన్ని కేవలం మర ఆడించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రైస్ మిల్లర్లు కుంటి సాకులు చెబుతూ ప్రభుత్వానికి పంగనామాలు పెడుతున్నారు. కోట్లాది రూపాయల ధాన్యాన్ని ఇష్టానుసారంగా అమ్ముకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు. దీనితో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి కొడుతున్నారు. ఇది చాలదన్నట్లు పీడీఎస్ రైస్ దందా మరోవైపు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


Similar News