రైతులు సన్న రకం వరి సాగు పై దృష్టి సారించాలి : ఎమ్మెల్యే కవ్వంపల్లి

రైతులు సన్న రకం వరి సాగుపై దృష్టి సారించాలని మానకొండూర్ ఎమ్మెల్యే

Update: 2024-10-14 12:57 GMT

దిశ,తిమ్మాపూర్ : రైతులు సన్న రకం వరి సాగుపై దృష్టి సారించాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. సోమవారం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న రకం వరి ధాన్యానికి మార్కెట్ లో డిమాండ్ ఉందని, సన్న రకం బియ్యాన్ని వాడేందుకు ప్రజలు ఇష్టపడుతున్నందున రైతులు కూడా సన్న రకం వరి సాగు చేస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. సన్న రకం వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగానే సాగు చేసే రైతులకు రూ.500 బోనస్ ఇస్తోందని గుర్తు చేశారు.

రైతులు పండించిన వరి ధాన్యం అమ్మకాల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతుల డిమాండ్ మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ ధాన్యం తూకాల్లో మోసాలకు తావు లేదని స్పష్టం చేశారు. తాలు తరుగు పేరిట ఎలాంటి కటింగులు ఉండవని, ఒకవేళ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తెలకపల్లి రాజు, కృష్ణబాబు,నాయకులు బి. రాజు, జ్యోతి, శ్రీధర్ కొండలరావు, తిరుపతిరెడ్డి, కే సంపత్, శ్రీకాంత్, సుధాకర్ రెడ్డి, బి. సుధాకర్, లింగారెడ్డి, పి చిరంజీవి, అంకూస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Similar News